భూదాన్‌పోచంపల్లి: చేనేత కార్మికులకు ఉపాఽధి కల్పనే లక్ష్యంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో జూన్ 5,6,7 తేదీల్లో ప్రత్యేకంగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అనురాగ్‌జయంతి వెల్లడించారు. థ్రెడ్ పేరిట నిర్వహిస్తున్న పోచంపల్లి ఇక్కత్‌వస్త్రాల ఎగ్జిబిషన్ వాల్‌పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర చేనేత, జౌళిశాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే ఈ ఎగ్జిబిషన్‌కు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా మంత్రిని కలెక్టర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో కేవలం యాదాద్రి భువనగిరి జిల్లాలో తయారయ్యే పోచంపల్లి చేనేత వస్త్రోత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల మేళాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో పోచంపల్లికి చెందిన 100 స్టాల్స్, అనుబంధంగా శ్రీశక్తి సంఘాల స్టాల్స్ కూడా ఉంటాయని ఆయన వివరించారు. కార్మికుల కళానైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు వారికి ప్రత్యక్షంగా మార్కెటింగ్ కల్పించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


