మోత్కూరు : బీసీ రిజర్వేషన్లపై అమలవుతున్న క్రీమీలేయర్ విధానాన్ని ఎత్తి వేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోత్కూరు విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీ బాయి ఫూలే విగ్రహాలను మంగళవారం ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన బీసీ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశ పెడతామని తెలిపారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో రిజర్వేషన్ల కేసులో సుప్రీం కోర్టు కూడా జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అన్ని వర్గాల నుంచి బలమైన సిఫార్సులు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. విద్య, ఉద్యోగ నియామకాలలో బీసీ రిజర్వేషన్లపై మాత్రమే క్రీమీలేయర్ నిబంధన విధించడం వివక్షకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రూ.2 కోట్లతో పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశం విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షుడు కూరాకుల అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కుమారస్వామి, రాష్ట్రకార్య నిర్వాహక అధ్యక్షుడు జి.బ్రహ్మేందర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, కంపెనీ అధ్యక్షుడు పి.యాదగిరి, బొబ్బిలి మురళి, ఎస్‌ఈ కందాల సురేష్‌కుమార్, డీఈఈలు సుధీర్‌కుమార్, హరీష్‌కుమార్, సంఘం వెంకటేశ్వర్లు, ఎస్.మల్లిఖార్జున్ గౌడ్, టి.శ్రీనివాసులు, విజయభాస్కర్‌రెడ్డి, ఏడీఈ బాలునాయక్, ధర్మికోట నరేష్, జిల్లపల్లి వెంకటేశ్వర్లు, పల్లెగొర్ల మోది, రామ్‌దేవ్ యాదవ్, కలిమెల నర్సయ్య, అవిశెట్టి అవిలుమల్లు, పురుగుల శ్రీనివాస్, పుల్కరం శేఖర్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్


