మోత్కూరు : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను హైదరాబాద్‌లోని గవర్నర్ భవన్‌లో మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
పీస్ కమిటీలు ఏర్పాటు చేయాలి
మోత్కూరు : శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామాలు, పట్టణాల్లో పీస్ కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ కాంప్‌లైంట్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు సూచించారు. రాష్ట్ర డీజీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో వర్రె వెంకటేశ్వర్లు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీసీ ఫుటేజీల నిర్వహణ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో శాంతి భద్రతలు అదుపులోకి రావడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరి రక్షణలో దేశంలోనే పోలీస్ వ్యవస్థ నంబర్ వన్‌గా నిలవడం హర్షణీయమన్నారు.
యాదగిరిగుట్ట కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైన గల వర్తక సంఘాన్ని రద్దు చేసి, టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన అన్నల్ధాస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని దేవాదాయ, ధర్మదాయ శాఖ కార్యాలయం ఎదుట కళాకారులు ..శ్రీనృసింహస్వామి, లక్ష్మీదేవి, రాక్షసుల వేషధారణలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడారు. కొండపైన వ్యాపారుల దోపిడీని అరికట్టాలని కోరారు.
యాదగిరీశుడి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిక్షేత్రంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు.


