సాక్షి, యాదాద్రి: కల్తీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన, ఎరువుల డీలర్లతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా కల్తీ విత్తనాల విక్రయాలు జరగకుండా అధికారులు, డీలర్లు కఠిన నిఘా ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పర్యావరణానికి నష్టం చేకూర్చే పత్తి విత్తన రకమైన శ్రీహెచ్‌టీ కాటన్‌శ్రీను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని, జిల్లాలో ఎక్కడా ఈ రకం విత్తనాలు విక్రయించకుండా చూడాలన్నారు. ప్రత్యేక యాప్ ద్వారానే డీలర్లందరూ బుకింగ్స్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, విత్తన, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.
రైతులపై ప్రేమ ఉంటే
బీజేపీ ఢిల్లీలో పోరాడాలి
ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర బీజేపీ నాయకులకు రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీలో పోరాడాలని భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి హితవుపలికారు.భువనగిరి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా యాత్రను తెలంగాణలో కాకుండా ఢిల్లీలో నిర్వహించి ఎఫ్‌సీఐ.. సీఎంఆర్ తీసుకునేలా..కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్లే మిల్లుల్లో ధాన్యం దించుకోలేని పరిస్థితి ఎదురైందని ఆయన తెలిపారు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి తాము అధికారులు, మిల్లర్లు, రైతులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు.రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ భరోసా యాత్రలు నిర్వహిస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తి పారదర్శకతతో, చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. గత రెండు పంటల సీజన్ల నుంచి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్లే మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. సమావేశంలో భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, గ్రంథాలయ చైర్మన్ అవైస్ చిస్తీ, నాయకులు బర్రె జహంగీర్, కూర వెంకట్, మున్సిపల్ కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.


