అన్న కొడుకే హతమార్చాడు | - | Sakshi
Sakshi News home page

అన్న కొడుకే హతమార్చాడు

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట రూరల్‌ పరిధిలోని సోలిపేట గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగిన మేకల జయరాములు(54) హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూమి గెట్టు పంచాయితీతో సొంత అన్న కొడుకే ఈ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ నరసింహ కేసు వివరాలను వెల్లడించారు. సోలిపేటకు చెందిన మేకల జయరాములు గతంలో తన పిల్లల చదువుల కోసం సూర్యాపేటలో నివాసముండేవాడు. గ్రామంలో తనకు వారసత్వంగా వచ్చిన మూడెకరాల వ్యవసాయ భూమిని తన చిన్న అన్న మేకల కృష్ణయ్యకు 12 ఏళ్లు కౌలుకు ఇచ్చాడు. అనంతరం గ్రామానికి తిరిగి వచ్చిన జయరాములు తన భూమిని తానే సాగు చేసుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో భూమి గెట్లు, ఇంటి హద్దుల విషయంలో జయరాములు కుటుంబానికి, అన్న కృష్ణయ్య కుటుంబానికి తరచూ గొడవలు జరుగుతుండేవి.

దావత్‌ సమయంలో హత్యకు పథకం..

జయరాములు అన్న మేకల కృష్ణయ్య కుమారుడు మేకల కిరణ్‌ సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కిరణ్‌ తన భార్య మౌనికతో కలిసి వారం క్రితం గ్రామానికి వచ్చాడు. ఇటీవల పొలంలో బోరు వేయించగా.. సోమవారం మోటారు అమర్చారు. అనంతరం కృష్ణయ్య, అతడి భార్య లక్ష్మమ్మ, కుమారుడు కిరణ్‌, అతడి భార్య మౌనికతో పాటు అదే గ్రామానికి చెందిన మట్టపల్లి రామచంద్రు కలిసి అక్కడే దావత్‌ చేసుకున్నారు. అదే సమయంలో జయరాములు పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. భూమి పంచాయితీల నేపథ్యంలో జయరాములును అంతమొందించాలని వారు పథకం రచించారు. జయరాములు సాయంత్రం మళ్లీ పొలానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. గ్రామ ఆర్చీ వద్ద కిరణ్‌, అతడి భార్య మౌనిక స్కూటర్‌పై కాపుగాశారు. రాత్రి సుమారు 7 గంటల సమయంలో జయరాములు బైక్‌పై అక్కడికి చేరుకోగానే అతడిని అడ్డగించి గొడవకు దిగారు. ఈ క్రమంలో కిరణ్‌ గొడ్డలితో జయరాములుపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం కిరణ్‌, అతడి భార్య మౌనికతో పాటు కిరణ్‌ తల్లిదండ్రులు, రామచంద్రు గ్రామం నుంచి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యాపేట రూరల్‌ సీఐ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌ వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. భూమి గెట్టు వివాదం కారణంగానే హత్య చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, స్కూటర్‌, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన డీఎస్పీ ప్రసన్నకుమార్‌, రూరల్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ బాలు నాయక్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

జయరాములు హత్య కేసును

ఛేదించిన పోలీసులు

భూమి గెట్టు పంచాయితీ కారణంతో

గొడ్డలితో దాడి చేసి హత్య

ఐదుగురు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన

సూర్యాపేట ఎస్పీ నరసింహ

Advertisement
 
Advertisement
Advertisement