వడదెబ్బతో వృద్ధురాలు మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వృద్ధురాలు మృతి

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

చిట్యాల : మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డుకు చెందిన చిట్యాల జమునాబాయి(75) వడదెబ్బకు గురై సోమవారం రాత్రి మృతిచెందింది. తీవ్రమైన ఎండ వేడిమికి సోమవారం సాయంత్రం జమునాబాయి అస్వస్థతకు గురైంది. రాత్రి ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందినట్లు కుమారుడు రవి పేర్కొన్నారు. మృతురాలి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు.

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం..

తప్పిన ప్రమాదం

చివ్వెంల(సూర్యాపేట) : లారీలో డ్రైవర్‌ వంట చేస్తుండగా గ్యాస్‌ లీక్‌ కాగా.. గ్యాస్‌ సిలిండర్‌ను బయటకు విసరడంతో చెట్టుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీగూడెం గ్రామంలోని వరి పొట్టు కంపెనీకి సంబంధించిన లారీని డ్రైవర్‌ సూర్యాపేట–ఖమ్మం రహదారి పక్కన ఆపాడు. లారీలోనే చిన్న గ్యాస్‌ పొయ్యిపై వంట చేస్తుండగా గ్యాస్‌ లీకై మంటలు వచ్చాయి. దీంతో పక్కనే ఉన్న మర్రి చెట్టుపైకి గ్యాస్‌ పొయ్యిని విసిరాడు. దీంతో చెట్టుకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు లేచాయి. లారీలో వరి పొట్టు ఉండటం, చెట్టు పైనుంచి 11 కేవీ విద్యుత్‌ లైన్లు వెళ్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు.

కుమారులతో కలిసి

మహిళ అదృశ్యం

పెద్దవూర : మండలంలోని మల్లెవానికుంటతండాకు చెందిన మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైంది. మంగళవారం పెద్దవూర ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లెవానికుంటతండాకు చెందిన రమావత్‌ ప్రభాకర్‌, నాగమణి దంపతుల కుమార్తె మౌనికకు 2021లో ఏపీలోని ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన నాగార్జునతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్‌, నాగచైతన్య ఉన్నారు. రెండేళ్ల క్రితం నాగార్జున రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మౌనిక తన ఇద్దరు కుమారులతో కలిసి మల్లెవానికుంటతండాలో తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ నెల 22న మౌనికకు తన తల్లి నాగమణితో చిన్న గొడవ జరిగింది. దీంతో 23న ఉదయం తన ఇద్దరు కుమారులను తీసుకుని మౌనిక ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. మౌనిక సోదరి శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు 87126 7098, 87126 75111 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

కత్తితో దాడి..

ఇద్దరి రిమాండ్‌

చండూరు : యువకుడిపై కత్తితో దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు పట్టణంలో ఆదివారం దోటి శివ అనే యువకుడిపై నాగిళ్ల నరేష్‌, బుషిపాక విజయ్‌ కత్తితో దాడి చేశారు. శివ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం నరేష్‌, విజయ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement