విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

పాలకవీడు : విద్యుత్‌ స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గా వద్ద 33/11కేవీ సబ్‌స్టేషన్‌ సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పాలకవీడు మండలంలో పలు చోట్ల విద్యుత్‌ లైన్లు తెగిపడ్డాయి. దీంతో దామరచర్ల మండలం గణేష్‌పహాడ్‌ గ్రామానికి చెందిన విద్యుత్‌ కాంట్రాక్టర్‌ కొర్ర రవి(31)కి మరమ్మతుల పనులను విద్యుత్‌ శాఖ అధికారులు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం రవి జాన్‌పహాడ్‌ దర్గా వద్ద గల సబ్‌స్టేషన్‌ సమీపంలో విద్యుత్‌ స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడి మృతిచెందాడు. అంబులెన్స్‌లో అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే రవి మృతిచెందాడని బంధువులు, గ్రామస్తులు సబ్‌స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మరమ్మతుల కోసం ఎల్‌సీ తీసుకునే విషయమై విద్యుత్‌ అధికారులు, రవికి మధ్య సమన్వయం లోపించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇంట్లో విద్యుత్‌ తీగలు తగిలి..

కొండమల్లేపల్లి : మండలంలోని గుడితండా గ్రామానికి చెందిన నేనావత్‌ చందు(52) మంగళవారం సాయంత్రం ఇంట్లో విద్యుత్‌ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం అతడిని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement