లొంగిపోయిన ఇద్దరు నిందితులు..
చింతలపాటి మధు హత్య కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. ఈ హత్యలో ప్రమేయం ఉన్న మరికొంత మంది నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలిస్తున్నారు.
ఫ కలకలం సృష్టించిన
బీఆర్‌ఎస్ నాయకుడి హత్య
ఫ గతంలోనూ పలు ప్రతీకార హత్యలు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలంలోని యర్కారం గ్రామం రక్తచరిత్రగా మారింది. గ్రామంలో దశాబ్దాలుగా నడుస్తున్న రాజకీయ కక్షలు మరోసారి రగిలాయి. గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు చింతలపాటి మధు (44) దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనపడకుండా పోయిన మధు శనివారం ఉదయం గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద శవమై తేలారు. హంతకులు మధును అతికిరాతంగా చంపి మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి కాలువలో పడేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. 2007లో జరిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ దారుణ హత్యకు ప్రతికారంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మిద్దె రవీందర్ హత్యలో మధు ప్రధాన నింధితుడిగా ఉన్నారు. మిద్దె రవీందర్ కుమారుడు తన అనుచరులతో కలిసి పక్కా ప్రణాళికతో మధును హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు 2020లో జరిగిన బీఆర్‌ఎస్ నాయకుడు ఒంటెద్దు వెంకన్న హత్యలో ప్రధాన సాక్షిగా ఉన్న చింతలపాటి మధును హత్య చేస్తే సాక్షం ఉండదనే వెంకన్నను హత్య చేసిన ముఠా మధును కూడా హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
లీడర్లుగా ఎదగాల్సిన
వయసులో శవాలుగా..
యార్కారం గ్రామంలో ఫ్యాక్షన్ బీజాలు నిన్న మొన్నటివి కావు. 1985 ప్రాంతంలో స్థానిక రాజకీయాలు, వర్గ ఆధిపత్యంతో మొదలైన ఈ వివాదం క్రమంగా ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆ తర్వాత వచ్చిన ప్రాంతీయ పార్టీల అండతో ఇరువర్గాలు పంతాలకు పోయాయి. గత నలభై ఏళ్లలో ఈ గ్రామానికి చెందిన దాదాపు తొమ్మిది మంది ముఖ్య నేతలు లీడర్లుగా ఎదగాల్సిన వయసులో శవాలుగా మారారు. గ్రామాల్లో ఎన్నికలు వస్తే చాలు, ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందోనని ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది.
మిద్దె రవీందర్ హత్య..
మలుపు తిరిగిన రాజకీయం
ఈ రక్తచరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత మిద్దె రవీందర్ హత్య. 2004లో గ్రామంలో తనకంటూ ప్రత్యేక అనుచరవర్గాన్ని సంపాదించుకుని, ఎదురులేకుండా ఎదుగుతున్న రవీందర్‌ను ప్రత్యర్థి వర్గం టార్గెట్ చేసింది. పక్కా స్కెచ్‌తో 2007లో ఆయన్ను వేటాడి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యతో యార్కారంలో ఒక వర్గం పూర్తిగా బలహీనపడినట్లు కనిపించినా, లోపల మాత్రం ప్రతీకార జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింతలపాటి మధు వర్గానికి, రవీందర్ వర్గానికి మధ్య అప్పటి నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం సాగింది. మిద్దె రవీందర్ హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా రాజకీయ వైరం పరంపరగా కొనసాగుతూ వచ్చింది. 2020 ఫిబ్రవరిలో సహకార సంఘం ఎన్నికల వేళ ఈ కక్షలు మళ్లీ మొదలయ్యాయి. యార్కారం మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను కాంగ్రెస్ నాయకుడు వడ్డె యల్లయ్యతో పాటు మరికొంత మంది గొడ్డళ్లతో వెంబడించి గ్రామంలో దారుణంగా హత్య చేశారు. నాడు మిద్దె రవీందర్ ఎలాగైతే హత్యకు గురయ్యారో, అదే తరహాలో వెంకన్నను కూడా హతమార్చడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో చింతలపాటి మధు ప్రధాన సాక్షిగా నిలబడ్డారు. అలాగే 2024లో కాంగ్రెస్ నాయకుడు వడ్డె యల్లయ్యని జగ్గయ్యపేట సమీపంలో హత్య చేశారు.


