బ్యాంకుల వద్దకు వచ్చేవారే టార్గెట్‌ | - | Sakshi
Sakshi News home page

బ్యాంకుల వద్దకు వచ్చేవారే టార్గెట్‌

May 24 2026 1:57 AM | Updated on May 24 2026 1:57 AM

నల్లగొండ : బ్యాంకుల వద్దకు వచ్చే వారి దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో గల యూనియన్‌ బ్యాంకు వద్దకు ఈ నెల 19న తిప్పర్తికి చెందిన రైతు గాదె లింగయ్య వచ్చాడు. ధాన్యం అమ్మడంతో తన ఖాతాలో జమ అయిన రూ.1.50 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేసి బైక్‌ ట్యాంక్‌ కవర్‌లో పెట్టుకుని వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అతడి దృష్టి మరల్చి నగదుతో పరారయ్యారు. బాధితుడు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరు ఈ నెల 21న నకిరేకల్‌లో మరో రైతు వద్ద నుంచి కూడా రూ.1.40 లక్షలు దొంగతనం చేసి పారిపోతుండగా.. వాహనాల తనిఖీల్లో భాగంగా వారిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన ఇద్దరిలో ఒకరు మహారాష్టకు చెందిన కేశవ తేజదోక్వల కాగా.. మరొకరు మైనర్‌ అని పేర్కొన్నారు. మరో నిందితుడు రాహుల్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ.2.50 లక్షల నగదు, బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు మక్తల్‌, నల్లగొండ, ఖమ్మం నకిరేకల్‌ ప్రాంతాల్లో ఇదే తరహాలో చోరీలు చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ వివరించారు. ఈ కేసును ఛేదించిన వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు సైదులు, సైదాబాబు, పోలీస్‌ సిబ్బందిని అభినందించారు.

అప్రమత్తంగా ఉండాలి..

బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసేవారిని ఎంచుకుని దొంగతనాలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. బైక్‌ ఆయిల్‌ కారుతుందని, కింద నోట్లు పడేసినట్లు నటించడం, బట్టలపై పౌడర్‌ చల్లడం వంటి ట్రిక్స్‌తో నగదు ఎత్తుకెళ్తున్నారన్నారు. ఎవరి మీదనైనా అనుమానం వస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఫ చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్టు

ఫ రూ.2.50 లక్షల

నగదు, బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం

Advertisement
 
Advertisement
Advertisement