వీఐపీలను అడ్డుకున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

వీఐపీలను అడ్డుకున్న పోలీసులు

May 24 2026 1:57 AM | Updated on May 24 2026 1:57 AM

యాదగిరిగుట్ట : సీఎం రేవంత్‌రెడ్డి శనివారం యాదగిరిగుట్టకు రాగా.. ఆయనతో పాటు పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన వీఐపీలకు చేదు అనుభవం ఎదురైంది. సీఎం సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వారికి వేద పాఠశాల శంకుస్థాపన పూజ స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ‘మీరు ఎవరైతే మాకేంటి’ అంటూ వీఐపీలను అడ్డుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హెలిపాడ్‌ నుంచి వచ్చి సంప్రదాయ దుస్తులు మార్చుకునే సమయంలో శంకుస్థాపన చేసే స్థలానికి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మహిళా కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి చేరుకున్నారు. పూజ చేసే స్థలానికి వీరిని వెళ్లకుండా పోలీసులు, సీఎం సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాకు ప్రొటోకాల్‌ ఉంటుందంటూ వాదించారు. అనంతరం దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు జోక్యం చేసుకొని వారిని పూజ వద్దకు పంపించారు.

మర్యాద పాటించు..

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న సీఎంఓ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌రాజును కూడా పోలీసులు అడ్డుకున్నారు. తన కారును అడ్డుకోవడంతో నడుచుకుంటూ సీఎం వచ్చే ప్రాంతానికి ఆయన వెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ వచ్చే ముందు శ్రీనివాస్‌రాజు తన సిబ్బందిని రమ్మని పిలవగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస్‌రాజు ‘మర్యాద మెయిన్‌టెన్‌చేయ్‌.. మేము కూడా డ్యూటీలు చేశాం.. అతిగా చేస్తున్నావ్‌’ అంటూ మాట్లాడారు. ఇతర పోలీస్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని శ్రీనివాస్‌ రాజు వద్దకు తన సిబ్బందిని పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement