సాక్షి, యాదాద్రి : సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చిన పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. యాదగిరిగుట్టకు సీఎం హోదాలో ఆయన ఇప్పటికే నాలుగు సార్లు వచ్చారు. గత పర్యటనల్లో సీఎం ఇచ్చిన హామీలు, శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ పర్యటనలోనైనా పెండింగ్ బిల్లులు విడుదల చేసి, యాదగిరిగుట్టను పూర్తిస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సర్వత్రా కోరుతున్నారు.
విష్ణు పుష్కరిణి పునరుద్ధరించా లని డిమాండ్
కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడం నిర్వహించినప్పటికీ, కొంతకాలానికే నిలిచిపోయింది. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుష్కరిణి చుట్టూ వర్తక సంఘం ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటు చేయడంతో, భక్తులు దుస్తులు మార్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య కారణంగానే పుష్కరిణిని మూసివేసినట్లు తెలుస్తోంది.
కొండపైకి వచ్చే భక్తులకు రవాణా ఇబ్బందులు
గతంలో కొండపైకి 40 ఆర్టీసీ బస్సులు నడిపేవారు. ప్రస్తుతం బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. బస్టాండ్ ఆవరణలో బస్సులనే కాకుండా ప్రైవేట్ వాహనాలు నిలపడం, షాపుల నిర్వహణ వల్ల బస్సులు తిరగడానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. శని, ఆదివారాల్లో ఆర్టీసీ బస్సులు సరిపోవడం లేదు. కొండపై భక్తులకు సరిపడా టాయిలెట్ల సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా కొండపై భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన చింతపండు, నెయ్యి దొంగతనాలే ఇందుకు నిదర్శనం.
ప్రకటించని వైటీడీ పాలక మండలి
గత ముఖ్యమంత్రి ప్రకటించిన యాదాద్రి పేరును సీఎం రేవంత్‌రెడ్డి తిరిగి యాదగిరిగుట్టగా మార్చారు. టీటీడీ తరహాలో, వైటీడీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందింది. కానీ ఇంత వరకు పాలక మండలి ప్రకటించలేదు. పెండింగ్ పనుల నిధుల కోసం అధికారులు రూ. 200 కోట్ల అంచనాలతో నివేదికలు పంపారు. ఇందులో రూ. 100 కోట్లు పెండింగ్ పనులకు, మరో రూ. 100 కోట్లు పాత బిల్లుల చెల్లింపుల కోసం ప్రతిపాదించారు. కానీ ఈ నిధులు ఇంకా పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. అంతేకాకుండా మొదటి ఘాట్ రోడ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. వాటర్ ఫాల్స్ (జలపాతం)ను ప్రారంభంలో రెండు సార్లు ట్రయల్ రన్ వేసి చూశారు. ఆ తర్వాత దాని నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. కొండ కింద గండి చెరువు అభివృద్ధి, దుకాణాల సముదాయం, దేవస్థానం బస్టాండ్, ఎంట్రీ ఫ్లైఓవర్ వంటి మరో 15 శాతం పనులు బిల్లులు రాక నిలిచిపోయాయి.
గుట్టకు నాల్గవసారి రాక..
● సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు శనివారం నాల్గవ సారి వస్తున్నారు. ఈ పర్యటనలో దాదాపు రూ. 100 కోట్ల వ్యయంతో చేపట్టే వేద పాఠశాల, ఇతర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
● మొదటి సారి 2024 మార్చి 11న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా వచ్చి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.
● రెండవ సారి 2024 నవంబర్ 8న ఆయన తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనే యాదాద్రి పేరును ‘యాదగిరిగుట్ట’గా మారుస్తూ, టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
● మూడో సారి 2025 ఫిబ్రవరి 23న ఆలయంలో ఏర్పాటు చేసిన బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు యాదగిరిగుట్టకు విచ్చేశారు.
అభివృద్ధి పనులకు నిధుల
విడుదలలో జాప్యం
జిల్లాలో కాళేశ్వరం, మూసీ కాలువల ఆధునీకరణకు నిధులు విడుదల కావడం లేదు. మూసీ కాలువలైన బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువల ఆధునీకరణకు నిధులు మంజూరు చేశారే కానీ ఆర్థిక శాఖ నుంచి విడుదల కావడం లేదు. నృసింహసాగర్ సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలకు పరిహారం నిధులు సైతం విడుదల చేయడం లేదు. సంగెం వద్ద మూసి బ్రిడ్జి, భీమలింగం వద్ద అభివృద్ధి పనులు, గంధమల్ల రిజర్వాయర్ ముందుకు సాగడంలేదు.
సీఎం హోదాలో ఇప్పటికే నాలుగు సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన రేవంత్‌రెడ్డి
పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చని గతంలో ఇచ్చిన హామీలు
విష్ణు పుష్కరిణి మూసివేయడంపై
భక్తుల అసంతృప్తి
పెండింగ్‌లోనే వైటీడీ పాలక
మండలి ఏర్పాటు
సాగునీటి ప్రాజెక్టులకు
విడుదల కాని నిధులు


