రైల్వే సమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైల్వే సమస్యలను పరిష్కరించాలి

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

భువనగిరి: భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం కార్యదర్శి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. భువనగిరి రైల్వే స్టేషన్‌లో పాత సమయం ప్రకారమే కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపాలని కోరారు. భువనగిరిలో పద్మావతి, కోణార్క్‌, శాతవాహన, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలపాలన్నారు. సికింద్రాబాద్‌ నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించిన ఎంఎంటీఎస్‌ రైలు కోసం ఇళ్లు కోల్పోయిన 70 మంది బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వంగపల్లి– యాదగిరిగుట్ట మధ్య రైల్వే అండర్‌పాస్‌ నిర్మించాలని విన్నవించారు.

దివ్యాంగులు పథకాలను

సద్వినియోగం చేసుకోవాలి

భువనగిరి: దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేక అవసరాల గల దివ్యాంగులకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల ద్వారా దివ్యాంగులు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రాయితీలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవెజ్‌ చిస్తీ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీవాణి, మంజుల, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పాండునాయక్‌, డీసీహెచ్‌ఎస్‌ చిన్ననాయక్‌, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వం నిధులు

విడుదల చేయడం లేదు

● అధికారుల ఎదుట సర్పంచ్‌ల ఆందోళన

భువనగిరిటౌన్‌ : గ్రామాల్లో కనీస వసతులు కల్పించడానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్పంచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ సర్పంచ్‌లందరూ ఏకమై ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల ముందు ఆందోళనకు దిగారు. సమస్యలు చెప్పుకుందామని కలెక్టరేట్‌కు వస్తే కనీసం అధికారులు కూడా అందుబాటులో ఉండడం లేదని, క్షేత్రస్థాయిలో సర్పంచ్‌ల ఉనికిని, గౌరవాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు సర్పంచ్‌లతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. నిధుల విడుదలపై ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల సముదాయింపు, స్పష్టమైన హామీతో సర్పంచ్‌లు తమ ఆందోళనను విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement