భువనగిరి : చేయూత పథకం ద్వారా కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2వ తేదీన కొత్తగా చేయూత పథకం ద్వారా 2 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయాలని అసెంబ్లీ సమావేశంలో నిర్ణయించింది. కొత్త పింఛన్ల కోసం బడ్జెట్‌లో సైతం నిధులు కేటాయించింది. దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఎట్టకేలకు దరఖాస్తులదారుల ఎదురుచూపులకు తెరపడనుంది.
అక్రమాలకు చెక్
పింఛన్‌దారుల్లో కొందరు మృతి చెందినప్పటికీ డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి పింఛన్ వస్తూ పింఛన్‌దారు చనిపోతే మరొకరికి ప్రభుత్వం బదులాయిస్తోంది. పదేళ్లుగా లబ్ధిదారుల్లో కొందరు మృతి చెందగా వారి వ్యక్తిగత ఖాతాల్లో పింఛన్ జమ అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. వీరిని తొలగించి అక్రమాలకు చెక్‌పెట్టి నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా (అథెంటికేషన్) ధ్రువీకరణ ప్రక్రియను చేపట్టారు. మన జిల్లాలో ఈ అంశానికి సంబంధించి తక్కువగా ఉండడం విశేషం.
35వేల మంది దరఖాస్తుదారుల
ఎదురుచూపు
జిల్లాలో చేయూత పథకం ద్వారా 96,425 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతినెలా రూ.24.50 కోట్లు పింఛన్ రూపంలో నగదు పంపిణీ చేస్తున్నారు. కాగా కొత్త పింఛన కోసం జిల్లాలో సుమారు 35వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు ఉన్నారు. ఇందులో అర్హులైన లబ్ధిదారులకు జూన్ 2వ తేదీన కొత్త పింఛన్లు అందజేసే అవకాశం ఉంది.
జూన్ 2న కొత్త పింఛన్లు
ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు 35వేల మంది
ఇప్పటికే పింఛన్ పొందుతున్నవారు 96,425 మంది


