యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని టెంపుల్ సిటీపై 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.43కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాలతోపాటు, విశాలమైన పార్కింగ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, కంచికామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ శనివారం ఉదయం 9.37గంటలకు శంకుస్థాపన పూజలు చేయనున్నారు. ఈమేరకు ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ శుక్రవారం పరిశీలించారు. జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ విప్ అధికారులకు సూచించారు. వేద పాఠశాలకు శంకుస్థాపన చేసే స్థలాన్ని, కొండకు దిగువన వాహన పూజల చెంత ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా కొండపైన, ప్రెసిడెన్షియల్ సూట్, వేద పాఠశాల స్థలం, ఘాట్ రోడ్డు వంటి ప్రాంతాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి.
ముస్తాబైన ఆలయం
యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు ఆలయాధికారులు సిద్ధమయ్యారు. సీఎంను ఆకర్షించే విధంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఇప్పటికే పలువురు అర్చకులు, అధికారులకు ఈఓ భవాని శంకర్ బాధ్యతలను అప్పగించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులకు ఆశీర్వచనం చేసిన అనంతరం అందజేసే ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వ విప్
బీర్ల ఐలయ్య, అధికారులు


