ప్రగతి ప్రణాళికతో సంక్షేమం, అభివృద్ధి వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ప్రగతి ప్రణాళికతో సంక్షేమం, అభివృద్ధి వేగవంతం

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

సాక్షి, యాదాద్రి : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోందని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో తుంగతుర్తి, భువనగిరి ఎమ్మెల్యేలు మందుల సామెల్‌, కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, కలెక్టర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. రేషన్‌ కార్డు ఉన్న ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేస్తామని, జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమంలో భాగంగా రైతు భరోసా, రైతు బీమా పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉదయం అల్పాహారం పథకం త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే మందుల సామెల్‌ మాట్లాడుతూ. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ వ్యాపార రంగాల్లో రుణ సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తామన్నారు. రేషన్‌ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు నమోదయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు భాస్కర్‌ రావు, వెంకారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్లు తంగెల్లపల్లి శ్రీవాణి, బాలమణి, గుండ్లపల్లి వాణి, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

Advertisement
 
Advertisement
Advertisement