సాక్షి, యాదాద్రి : సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసినట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్, రెవెన్యూ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఫైర్, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ, ట్రాన్స్‌కో, హార్టికల్చర్, డీపీఆర్‌ఓ, సివిల్ సప్లయ్, ట్రాఫిక్ తదితర విభాగాల అధికారులు తమకు కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ఎస్పీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ.. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. టెంపుల్ సిటీ వద్ద హెలిపాడ్ నిర్మాణంతో పాటు రోడ్ల మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా భారీ బందోబస్తు, బారికేడింగ్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. అత్యవసర సేవల కోసం అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక శాఖను, తగిన వైద్య సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. మున్సిపాలిటీ, జిల్లా పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో శానిటేషన్ పనులను పక్కాగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, రెవెన్యూ డివిజనల్ అధికారులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనురాగ్ జయంతి


