నిజాయితీగా విధులు నిర్వహించే పోలీసులకు ప్రత్యేక గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

నిజాయితీగా విధులు నిర్వహించే పోలీసులకు ప్రత్యేక గుర్తింపు

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

మోత్కూరు : పోలీస్‌ అధికారులు క్రమశిక్షణ, నిష్పక్షపాత వైఖరి, సేవా దృక్పథంతో పని చేసినప్పుడే ప్రజల్లో పోలీస్‌ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మోత్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాయితీగా విధులు నిర్వహించే పోలీస్‌ అధికారులకు సమాజంలో ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఫ్లెండ్లీ పోలీసింగ్‌ అమల్లోకి వచ్చిన తరువాత ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న భయం, ఆందోళనలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం సామాన్య ప్రజలు కూడా ధైర్యంగా ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను నేరుగా తెలియజేస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి వర్గం చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించడంలో మీడియా, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వర్రె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

తెలంగాణ పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు

Advertisement
 
Advertisement
Advertisement