వర్షపు నీరు.. భవిష్యత్తుకు ఆధారం | - | Sakshi
Sakshi News home page

వర్షపు నీరు.. భవిష్యత్తుకు ఆధారం

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

గుర్రంపోడు : వర్షపు నీటిని ఒడిసి పట్టేలా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, కందకాలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భజలాలు వృద్ధి చెంది కరువు నుంచి విముక్తి పొందవచ్చు. ప్రస్తుతం ఉపాధి హామీ పనుల్లో భాగంగా కందకాలు, నీటి కొలనుల తవ్వకం వంటి పనులు జరుగుతున్నాయి. వీటిపై రైతులకు అవగాహన కల్పించేందుకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కరువు ప్రాంతాల్లో సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా రైతులు కందకాలు, బోర్ల వద్ద ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని ఉపాధి హామీ అధికారులు సూచిస్తున్నారు. కరువు ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణపై గుర్రంపోడు మండల ఉపాధి హామీ పథకం అదనపు ప్రోగ్రాం అధికారి కంచర్ల గోపాల్‌రెడ్డి అందిస్తున్న సూచనలు, సలహాలు..

కందకాల తవ్వకం ఇలా..

రైతులు తమ వ్యవసాయ భూముల్లో కందకాలు తవ్వుకోవడం వలన ఎంతో మేలు జరుగుతుంది. చేనులోని వాలుకు అడ్డంగా ప్రతి వంద మీటర్లకు ఒక మీటరు లోతు, అరమీటరు వెడల్పు గల సమతల(ఒకే లెవల్‌లో) కందకాలను తవ్వుకోవాలి. దీని వల్ల చేనులో కురిసిన వాన నీరంతా భూమిలో ఇంకి భూగర్భజలాలు వృద్ధి చెందుతాయి. దీంతో బోర్లు లోతుగా వేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా చేనులోని పాత బావుల్లో పూడిక తీసినా సరిపోను నీరు లభిస్తుంది. భూగర్భజలాలు పైకి రావడం వల్ల కరెంట్‌ వినియోగం తక్కువై పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుంది.

సమతల మడులు

చేను మొత్తం సమతలంగా ఉంటే అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పరుచుకోవాలి. మడుల కట్టలు కనీసం అరమీటరు ఎత్తుగా ఉండేటట్లు పక్కనే కందకం తవ్వి వర్షం నీరంతా ఇంకింప చేయడం వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి.

గుట్టల చుట్టూ..

గుట్టల చుట్టూ భూములు ఉంటే గుట్టల చుట్టూ ఒక మీటరు వెడల్పు, మీటరున్నర లోతు కందకాలు తవ్వుకోవాలి. గుట్టలపై పడిన వర్షపు నీరు ఈ కందకాల ద్వారా భూమిలో చేరుతాయి.

ఊర చెరువు కందకాలు

ప్రతి ఊరి చెరువులో మధ్యలో 3 మీ. వెడల్పు 20 మీ. పొడవు, 3 మీ. లోతు కందకాలు తవ్వుకుంటే ఎండాకాలం పశువులకు సరిపడా నీరు దొరుకుతుంది.

ఊట చెరువు కందకాలు

ఊట చెరువుల్లో ఒక మీటరు వెడల్పు, 1.5 మీటరు లోతు, 20 మీటర్ల పొడవుగల కందకం తవ్వుకుంటే భూగర్భజలాలు పదిరెట్లు వృద్ధి చెందుతాయి.

ఇంకుడు గుంతలు

ప్రతి ఇంటి ఆవరణలోనూ రెండు నుంచి నాలుగు ఇంకుడు గుంతలు ఏర్పరుచుకుంటే ఇంట్లోని బోరుకు పుష్కలంగా నీరు అందుతుంది. ఇంకుడు గుంతల్లో అరమీటరు దొడ్డు కంకర, పైన పావు మీటరు సన్న కంకర, ఆపై పావు మీటరులో ఇసుక నింపాలి. పై పద్ధతులను రైతులు అవలంబిస్తే భూగర్భజలాలు సరిపడా అందుబాటులోకి వచ్చి పంటలు పండించుకోవచ్చు.

ఫ ఇంకుడు గుంతలు, కందకాల ఏర్పాటుతో

వాన నీటి సంరక్షణ

ఫ గుర్రంపోడు ఉపాధి హామీ పథకం అదనపు ప్రోగ్రాం అధికారి గోపాల్‌రెడ్డి సూచనలు

Advertisement
 
Advertisement
Advertisement