భువనగిరి(బీబీనగర్) : ఏపీని నుంచి వలస వచ్చి బీబీనగర్ మండలం నెమురగోముల గ్రామంలో ఉంటున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన పాటిబండ్ల శౌరిబాబు తన భార్య మౌనికతో కలిసి నెమురగోముల గ్రామంలోని ఓ డెయిరీ ఫామ్‌లో పనిచేస్తున్నాడు. ప్రతినెలా శౌరిబాబు పింఛన్ తీసుకునేందుకు స్వగ్రామానికి వెళ్తుంటాడు. గత రెండు నెలలుగా పింఛన్ కోసం స్వగ్రామానికి వెళ్లకపోవడంతో అతడి సోదరుడు మల్లేశ్వర్‌రావు శుక్రవారం నెమురగోముల గ్రామానికి వచ్చాడు. ఇక్కడ శౌరిబాబు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
సాగర్‌లో చిరుతపులి
సంచారం..?
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీలోని కెనాల్స్‌లో చిరుతపులిని పోలిన జంతువు సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. గురువారం రాత్రి కెనాల్స్‌లోని వీధిలో సీసీ రోడ్డు దాటుతున్నట్లు, చిరుతపులి లాగే అరిచిన అరుపులు రికార్డయ్యాయి. ఈ వీడియోను అటవీశాఖ అధికారులకు చూయించగా చిరుతపులిలాగే ఉందని, వీడియోను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. వడగాల్పులు తీవ్రంగా ఉండటంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి చిరుతపులి జనసంచారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదని రిటైర్డ్ సీనియర్ అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తూఫాన్ వాహనం బోల్తా
● పలువురికి గాయాలు
అర్వపల్లి : సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై అర్వపల్లి శివారులో శుక్రవారం తూఫాన్ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన కొంతమంది తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి చెందిన భార్యాభర్తల పంచాయితీ విషయమై మాట్లాడటానికి తూఫాన్ వాహనంలో వెళ్తుండగా.. అర్వపల్లి శివారులోకి రాగానే వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నందిపాటి జానయ్య, ప్రశాంత్, వాడపల్లి నగేష్, డ్రైవర్ ప్రశాంత్ వాహనంలో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎస్‌ఐ సైదులు, కానిస్టేబుల్ ఆదిరమణ, స్థానికులు కలిసి క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. బోల్తా పడిన వాహనాన్ని క్రేన్ సహాయంతో రోడ్డు పక్కకు తీసుకెళ్లారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
మేళ్లచెరువు : చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందాడు. స్థానిక ఎస్‌ఐ పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామానికి చెందిన వడ్డేపల్లి వీరబాబు(25) చింతలపాలెం మండలం దొండపాడు గ్రామానికి చెందిన వరసకు తన మేనత్త అయ్యే మహిళతో సహజీవనం చేస్తూ ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. శుక్రవారం తనకు ఆరోగ్యం బాగోలేదని వీరబాబు చెప్పడంతో స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి చూపించారు. అనంతరం కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. వీరబాబు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.


