చేపలు పడుతూ విద్యుదాఘాతంతో మృతి | - | Sakshi
Sakshi News home page

చేపలు పడుతూ విద్యుదాఘాతంతో మృతి

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

నిడమనూరు : కరెంట్‌ తీగలతో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరులో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరుకు చెందిన పిడుగు రాజు(40) డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నిడమనూరు చెరువు దిగువన చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కరెంట్‌ తీగల సహాయంతో చేపలు పడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి కుమారుడు తేజ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నిడమనూరు ఎస్‌ఐ తెలిపారు.

మంటలు అంటుకుని

బత్తాయి తోటలు దగ్ధం

పెద్దవూర : మండలంలోని కోమటికుంటతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బాసోనిబావితండాలో శుక్రవారం మంటలు అంటుకొని బత్తాయి తోటలు దగ్ధమయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాసోనిబావితండాకు చెందిన ముడావత్‌ ధనకోటి ఎకరం భూమిలో, ముడావత్‌ లక్ష్మణ్‌, ముడావత్‌ రవీందర్‌ ఎకరంన్నర చొప్పున భూమిలో ఎనిమిదేళ్లుగా బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులకు బత్తాయి తోట సమీపంలో ఉన్న విద్యుత్‌ తీగలు ఒకదానికొకటి రాసుకుని నిప్పు రవ్వలు వరి కొయ్యలకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న బత్తాయి తోటలకు మంటలు వ్యాపించి చెట్లు, డ్రిప్పు పరికరాలు, పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ముగ్గురి రైతుల బత్తాయి తోటల్లో పది టన్నులకు పైగా బత్తాయిలు పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

మోత్కూరులో గడ్డివాములు..

మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇంగీసమ్మ కుంట సమీపంలోని పొలాల్లో వరి కొయ్యలకు నిప్పు పెట్టగా.. గాలి ఉధృతికి ఆ మంటలు సమీపంలోని గడ్డివాములు, పశువుల కొట్టాల వరకు చేరుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు యత్నించారు. రైతులు కొట్టాల్లో ఉన్న పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో నిలిగొండ రమేష్‌, నిలిగొండ సోమయ్యకు చెందిన సుమారు వెయ్యి మోపుల గడ్డి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని బాధిత రైతులు కోరారు. గుర్తుతెలియని వ్యక్తులు వేసిన నిప్పు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రైతులు అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement