యువకుడి హత్యకు కారణమైన ‘గే యాప్‌’ | - | Sakshi
Sakshi News home page

యువకుడి హత్యకు కారణమైన ‘గే యాప్‌’

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

కోదాడ : సోషల్‌ మీడియాలో ఓ యాప్‌ ద్వారా ఏర్పడిన పరిచయం యువకుడి హత్యకు కారణమైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరానికి చెందిన బల్గూరి గణేష్‌(20) ఈ నెల 15న హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సామాజిక మాధ్యమంలో ఉన్న ‘పోలో’ గే యాప్‌ కారణమని, హత్యకు కారణమైన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా హత్యకు సహకరించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గణపవరానికి చెందిన బల్గూరి గణేష్‌కు, హుజూర్‌నగర్‌కు చెందిన బర్రెంకుల సోమేష్‌కు పోలో అనే గే యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఏకాంతంలో తీసుకున్న ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గణేష్‌ను చంపాలని సోమేష్‌ నిర్ణయించుకున్నాడు. దీనికి గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన తన స్నేహితుడు పగిల్ల ఉదయ్‌కిరణ్‌ సాయం తీసుకున్నాడు. గణేష్‌ హత్యకు సోమేష్‌ పథకం వేస్తున్న విషయం తెలిసినప్పటికీ సోమేష్‌ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతి మిన్నకుండిపోయారు. ఈ నెల 15న రాత్రి పథకం ప్రకారం సోమేష్‌.. గణేష్‌ను గణపవరానికి సమీపంలో ఉన్న మామిడి తోట వద్దకు పిలిచాడు. ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అక్కడే ఉన్న సోమేష్‌ స్నేహితుడు ఉదయ్‌కిరణ్‌ సాయంతో గణేష్‌పై రాయితో దాడి చేశారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. సంఘటన స్థలం నుంచి కత్తి, మొబైల్‌ ఫోన్లు ఇతర ఆధారాలను సేకరించినట్లు డీఎస్పీ తెలిపారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేసి సీసీ పుటేజీలు, మొబైల్‌ లొకేషన్లు పరిశీలించి నిందితులైన పగిళ్ల ఉదయ్‌కిరణ్‌, ప్రధాన నిందితుడైన సోమేష్‌ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతిలను శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌క పంపినట్లు ఆయన వెల్లడించారు. సోమేష్‌ పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో కోదాడ రూరల్‌ ఇన్‌చార్జీ సీఐ రామకృష్ణారెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి, మేళ్లచెరువు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌, చింతలపాలెం ఎస్‌ఐ పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

పరారీలో ప్రధాన నిందితుడు

గణపవరంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement