యాదగిరిగుట్ట : తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలూ వెళ్లలేదని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావాలని కోరితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకువచ్చేలా కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం సాయంత్రం ఆయన దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ పథకం కింద కొన్ని దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు వస్తున్నాయన్నారు. చాలా వరకు పురాతనమైన దేవాలయాలు కల్చరల్, టూరిజం శాఖ నుంచి నిధులు విడుదల అవుతున్నాయన్నారు. యాదగిరి క్షేత్రం అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ ఏమీ వెళ్లలేదన్నారు. దేవాదాయశాఖ అధీనంలో యాదగిరి క్షేత్రం ఉందని పేర్కొన్నారు. యాదగిరి దేవస్థానానికి భక్తులు వచ్చేందుకు వీలుగా జాతీయ రహదారిని విస్తరించడం, ఎంఎంటీఎస్ రైలును సైతం పొడిగించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా భువనగిరి కోటను అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. హిందూ దేవాలయాల భూములను రక్షించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాలయాలకు విముక్తి కల్పించాలన్నారు. వైటీడీ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఆయన వెంట బీజేపీ భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్, నాయకులు రచ్చ శ్రీనివాస్, కర్రె ప్రవీణ్, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు


