● విద్యుదాఘాతంతో మృతి
మర్రిగూడ : పుట్టింట్లో ఎల్లమ్మ పండుగకు వచ్చిన వివాహిత దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఈ ఘటన మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లేటి కృష్ణయ్య స్వరూప దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె కరుణశ్రీ(26)ని చింతపల్లి మండలం గొడుకొండ్ల గ్రామానికి చెందిన గ్యార జంగయ్యకు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. గురువారం తల్లిగారింట్లో ఎల్లమ్మ పండుగకు కరుణశ్రీ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి హాజరైంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందంగా గడిపారు. శుక్రవారం ఉదయం కరుణశ్రీ దుస్తులు ఉతికి ఇంటి ఆవరణలోని దండెంపై ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. ఆమె బంధువు కొత్తపల్లి లక్ష్మమ్మ గమనించి కరుణశ్రీని లాగేందుకు ప్రయత్నించగా.. ఆమెకు కూడా షాక్‌కు గురై ఇద్దరూ కిందపడ్డారు. వారిద్దరిని మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే కరుణశ్రీ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనా స్థలానికి ఎస్‌ఐ బి. రాంబాబు చేరుకోని పంచనామా నిర్వహించారు. మృతురాలి భర్త జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


