ఫ భువనగిరి, చౌటుప్పల్‌లో
43 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు
ఫ మరికొన్ని ప్రాంతాల్లో
42 డిగ్రీలకుపైగానే..
ఫ రాత్రి వేళల్లోనూ తగ్గని సెగలు
ఫ అల్లాడుతున్న ప్రజలు
భువనగిరిటౌన్, చౌటుప్పల్ : ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగత్రలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం జిల్లాలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా భువనగిరి, చౌటుప్పల్ పట్టణాల్లో 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే రాజాపేటలో 42, భూదాన్ పోచపంల్లిలో 42.7, మోత్కూరులో 42, గుట్టలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి భగభగలతో వడగాలులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. ఈ క్రమంలో ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వేళ, జాతీయ రహదారులు రోడ్లన్నీ జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా కనిపించారు. అయితే వారం రోజులుగా 40–42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతూనే ఉన్నాయి.
రాత్రి వేళల్లోనూ తప్పని తిప్పలు
పగటిపూట ఎండలు దంచికొడుతుంటే, రాత్రి వేళల్లోనూ కనీస ఉపశమనం లభించడం లేదు. సాధారణంగా సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లబడుతుందని భావించే ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. రాత్రి వేళల్లో సైతం ఉష్ణోగ్రతలు 32 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతుండడంతో ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది.
అల్లాడుతున్న కార్మికులు.. వాహనదారులు
తీవ్రమైన ఉడకపోత కారణంగా రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ద్విచక్ర, ఇతర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండ తీవ్రత దష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ లవణాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజులు కూడా ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ముఖ్యంగా శుక్రవారం గరిష్టంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరునుందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వచ్చే 10–15 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.


