టెంపుల్‌ సిటీపై రూ.100 కోట్ల పనులు | - | Sakshi
Sakshi News home page

టెంపుల్‌ సిటీపై రూ.100 కోట్ల పనులు

May 22 2026 5:40 AM | Updated on May 22 2026 5:40 AM

శంకుస్థాపన చేసే పనులు ఇవే..

యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో రూ.100 కోట్ల వ్యయంతో తలపెట్టిన వివిధ అభివృద్ధి పనులతోపాటు వేద పాఠశాల నిర్మాణానికి ఈ నెల 23న శంకుస్థాపన చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆలయ సిబ్బంది, జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే టెంపుల్‌ సిటీపై నిర్మించనున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల శంకుస్థాపన చేసే స్థలాన్ని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, పోలీస్‌ అధికారులు పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా ఇక కొండపైన దర్శనంలో లోటుపాట్లు లేకుండా ఈఓ భవాని శంకర్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు వివిధ శాఖ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

నాలుగవ సారి ఆలయానికి సీఎం రాక..

మొదటి సారి సీఎం అయ్యాక 2024 మార్చి 11న రేవంత్‌రెడ్డి సతీసమేతంగా వచ్చి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు శ్రీస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రెండోసారి సీఎం పుట్టిన రోజు సందర్భంగా శ్రీస్వామిని దర్శించుకొని, అనంతరం మూసీ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా భీమలింగం వద్ద 2024 నవంబర్‌ 9న పూజలు చేశారు. అదే రోజు యాదాద్రిగా ఉన్న పేరును యాదగిరిగుట్టగా మార్చారు. ఇక మూడోసారి యాదగిరీశుడి ఆలయ దివ్య విమాన గోపురం బంగారు తాపడం శ్రీస్వామి అంకితం ఇచ్చే మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి 2025 ఫిబ్రవరి 23వ తేదీన వచ్చారు. ఈ నెల 23వ తేదీన వేద పాఠశాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నాలుగవ సారి సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి రానున్నారు. 14 నెలల తర్వాత యాదగిరీశుడి సన్నిధికి సీఎం వస్తున్నారు.

ఫ మూడు దశల్లో వేద పాఠశాల నిర్మాణం

ఫ యాదగిరి కొండపైనా

కల్యాణ మండపం

ఫ 23వ తేదీన శంకుస్థాపనలు

ఫ సీఎం రేవంత్‌రెడ్డి, కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి రాక

యాదగిరి కొండకు సమీపంలో ఉన్న టెంపుల్‌ సిటీ (పెద్ద గుట్ట)పై శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వేద పాఠశాల 15 ఎకరాల్లో రూ.43 కోట్లతో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ వేద పాఠశాల నిర్మాణం పనుల్లో భాగంగా మొదటి దశలో రూ.23 కోట్లు, రెండు, మూడు దశల్లో రూ.10 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఇక యాదగిరి కొండపైన బస్టాండ్‌ సమీపంలో సుమారు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో మూడంతస్తులు కారు పార్కింగ్‌, మరో అంతస్తులో డార్మింటరీ హాల్‌, ఇంకో అంతస్తులో దీక్షాపరుల సన్నిధానం నిర్మిస్తారు. గతంలో భక్తులకు దర్శన సౌలభ్యం కోసం నిర్మించిన బాలాలయం స్థలంలో సుమారు 500 మందికిపైగా జంటలు కూర్చునేలా కల్యాణ మండపం నిర్మిస్తారు. ఇక మెట్లదారిలో పైకప్పు, ప్రొటోకాల్‌ కార్యాలయం సమీపంలోని లిఫ్టుకు వాయువ్య దిశలో నూతనంగా మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement