కల్వర్టును ఢీకొన్న బైక్‌.. వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కల్వర్టును ఢీకొన్న బైక్‌.. వ్యక్తి దుర్మరణం

May 21 2026 10:07 AM | Updated on May 21 2026 10:07 AM

చందంపేట : బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కల్వర్టును ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన చందంపేట మండలం కోరుట్ల సమీపంలో బుధవారం జరి గింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందంపేట మండలం బిల్డింగ్‌తండాకు చెందిన రమావత్‌ నరసింహ(51) బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా.. కోరుట్ల సమీపంలోకి రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నరసింహ తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి సోదరుడు రమావత్‌ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్‌ తెలిపారు.

గుండెపోటుతో

వేద పండితుడు మృతి

యాదగిరిగుట్ట రూరల్‌ : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వేద పండితుడు వేణుగోపాలచార్యులు బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతదేహానికి ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి పట్ల ఈఓ భవానీశంకర్‌, అర్చకులు, ఆలయ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా వేణుగోపాలచార్యులు ప్రస్తుతం పాత గుట్ట దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

వడదెబ్బతో

సెక్యూరిటీ గార్డు మృతి

కోదాడ: వడదెబ్బకు గురైన సెక్యూరిటీ గార్డు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన కొమ్ము జాకోబు(58) కొంతకాలంగా కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో నివాసముంటూ సనా ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం జాకోబు వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

లారీ క్లీనర్‌..

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : వడదెబ్బకు గురై లారీ క్లీనర్‌ మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ముక్కుడుదేవులపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ముక్కుడుదేవులపల్లి గ్రామానికి చెందిన బోడ లింగరాజు (34) లారీ క్లీనర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన అతడు వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. ఇంటి వద్ద ఎవరూరు లేకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. భార్యతో మనస్పర్థల కారణంగా లింగరాజు కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నట్లు తెలిసింది.

కళ్లుగప్పి డబ్బులు అపహరణ

నల్లగొండ : బ్యాంకులో నగదు డ్రా చేసి వెళ్తున్న వ్యక్తి కళ్లుగప్పి ముగ్గురు దొంగలు డబ్బులు అపహరించారు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో బుధవారం జరిగింది. టూటౌన్‌ ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని యూనియన్‌ బ్యాంక్‌లో ఓ వ్యక్తి రూ.1.50లక్షలు డ్రా చేసి బయటకు వచ్చి తన బైక్‌ ట్యాంక్‌ కవర్లో పెట్టుకున్నాడు. బైక్‌ను వెనుకకు తీస్తుండగా ముగ్గురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి ఆ డబ్బును తీసుకుని పారిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement