చెక్కు బౌన్స్‌ కేసులో జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

చెక్కు బౌన్స్‌ కేసులో జైలు శిక్ష

May 21 2026 10:07 AM | Updated on May 21 2026 10:07 AM

తుంగతుర్తి : చెక్కు బౌన్స్‌ కేసులో మహిళకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తుంగతుర్తి జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి ఎండీ గౌస్‌పాషా బుధవారం తీర్పు వెలువరించారు. కోర్టు సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన కందుకూరి లక్ష్మయ్య అదే గ్రామానికి చెందిన ఊడుగు మల్లికకు 2020 ఆగస్టు 2న రూ.10లక్షలు నెల రోజులకు అప్పుగా ఇచ్చాడు. నెల రోజుల తర్వాత లక్ష్మయ్య డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా మల్లిక చెక్కు ఇచ్చింది. ఆ చెక్కును తీసుకొని బ్యాంక్‌కు వెళ్లగా అకౌంట్‌లో డబ్బులు లేక చెక్కు బౌన్స్‌ అయ్యింది. దీంతో లక్ష్మయ్య కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో సాక్షులను విచారించిన జడ్జి ఎండీ గౌస్‌పాషా బుధవారం ఊడుగు మల్లికకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అదేవిధంగా లక్ష్మయ్యకు రూ.14 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ మృతి

మర్రిగూడ : బంగారు ఆభరణాలు తయారు చేస్తుండగా గ్యాస్‌ నుంచి మంటలు చెలరేగి తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వర్ణకారుడు పెరికోటి కోటయ్యచారి(60) ఈ నెల 17న తన దుకాణంలో బంగారు ఆభరణాలు తయారు చేస్తుండగా.. అతడు ఉపయోగించే గ్యాస్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి

మృతదేహం లభ్యం

నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీ వద్ద బుధవారం గుర్తుతెలియని వ్యక్తి(సుమారు 48 ఏళ్లు) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు టూటౌన్‌ ఎస్‌ఐ సైదులు తెలిపారు. మృతుడు నీలి రంగు గీతల షర్ట్‌, నీలం రంగు ప్యాంట్‌ ధరించాడని, మృతుడి వివరాలు తెలిసిన వారు నల్లగొండ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

తప్పిపోయిన బాలుడు

చైల్డ్‌ వెల్ఫేర్‌ కేర్‌ హోంకు

తరలించిన పోలీసులు

మోత్కూరు : తప్పిపోయిన బాలుడిని పోలీసులు చైల్డ్‌ వెల్ఫేర్‌ కేర్‌ హోంకు తరలించారు. వివరాలు.. మోత్కూరు మున్సిపాలిటీలో మంగళవారం రోడ్లపై తిరుగుతున్న ఓ బాలుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడిని చేరదీసి వివరాలు అడగగా.. తన పేరు బోగి అభి(12) అని, తల్లి పేరు లక్ష్మి అని చెప్పాడు. తన తల్లితో కలిసి జనగామ నుంచి బస్సులో మోత్కూరుకు వచ్చానని, చిన్న పిల్లల వస్తువులు విక్రయిస్తూ ఉంటామని, తన తల్లి కనిపించకపోవడంతో దుకాణాల వద్ద తిరుగుతున్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో బాలుడిని బుధవారం పోలీసులు భువనగిరిలోని చైల్డ్‌ వెల్ఫేర్‌ కేర్‌ హోంకు తరలించారు. బాలుడి తల్లిదండ్రుల వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement