నాగార్జునసాగర్ : సాగర్ ప్రాజెక్టు దిగువన కృష్ణా నది తీరం మొసళ్లకు నిలయంగా మారింది. గతంతో పోలిస్తే నదిలో మొసళ్ల సంచారం పెరిగింది. పర్యాటకులు, ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వచ్చే నూతన జంటలు, ఫొటోగ్రాఫర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి అడవిదేవులపల్లి వరకు కృష్ణా తీరంలో గల గ్రామాలు, తండాలవాసులు మొసళ్లను చూసి భయపడుతున్నారు. సాగర్ డ్యాంకు దిగువన కృష్ణా తీరంలో మొసళ్లు విపరీతంగా పెరిగినట్లు మత్స్యకారులు సైతం చెబుతున్నారు. సాగర్ డ్యాం దిగువన టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నిర్మించారు. దీనిలో కలిసే ఉపనది అయిన చంద్రవంకవాగు ఎత్తిపోతల జలపాతం మీది నుంచి వస్తుంది. ఎత్తిపోతలకు దిగువన మొసళ్లు పెరిగేందుకు అనువైన ప్రాంతం కావడంతో ఇక్కడ మొసళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ లోయ వరకు కృష్ణా నది నీరు ఉండటంతో ఆ మొసళ్లన్నీ టెయిల్‌పాండ్ జలాశయంలోకి చేరాయి. ఇటీవల నాయకునితండాకు చెందిన మహిళ కృష్ణా నది తీరంలో బట్టలు ఉతుకుతుండగా మొసలి దాడి చేయడంతో అరుస్తూ బయటకు పరుగెత్తుకొచ్చింది. అదేవిధంగా పశువులు, జీవాలు నీరు తాగేందుకు నదిలోకి వెళ్లగా వాటిపై దాడులు చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. అటవీశాఖ అధికారులు కృష్ణా తీరంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తీరం వెంట ఉన్న గ్రామాలు, తండాల వాసులు కోరుతున్నారు.
ఫ సాగర్ ప్రాజెక్టు దిగువన కృష్ణా నది తీరంలో ఎక్కువగా కనిపిస్తున్న మొసళ్లు
ఫ పర్యాటకులు జాగ్రత్తగా
ఉండాలంటున్న పోలీసులు


