కేతేపల్లి : గుర్తుతెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టగా.. ఆ మంటలు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ వరకు వ్యాపించి స్టేషన్ ఎదుట నిలిపి ఉంచిన వాహనాలకు అంటుకుని దగ్ధమయ్యాయి. ఈ ఘటన కేతేపల్లిలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మూసీ కాల్వ వెంట పోలీస్ స్టేషన్ ఉంది. స్టేషన్ పక్కనే వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూముల్లోని వరి కొయ్యలకు బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. ఆ సమయంలో గాలులు బలంగా వీయడంతో మంటలు పెద్దఎత్తున లేచాయి. సమీపంలోనే ఉన్న కేతేపల్లి పోలీస్ స్టేషన్ వరకు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన పోలీస్ సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే వివిధ కేసుల్లో సీజ్ చేసి స్టేషన్ ఎదుట పార్కింగ్ చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. స్థానికుల సహాయంతో పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. సమాచారం అందుకున్న నకిరేకల్ ఫైర్‌స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 25 బైక్‌లు, నాలుగు కార్లు, ఆటో, లారీ దగ్ధమయ్యాయి. నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ కేతేపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
ఫ పక్కనే వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో వ్యాపించిన మంటలు
ఫ వివిధ కేసుల్లో సీజ్ చేసిన
వాహనాలు దగ్ధం


