సూర్యాపేటటౌన్ : ఆస్తి కోసం అక్కను హత్య చేసిన తమ్ముడితో పాటు అతడి భార్య, కుమారుడిని ఆత్మకూర్(ఎస్) పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను బుధవారం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తన కార్యాలయంలో వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్‌పహడ్ గ్రామానికి చెందిన సురభి సైదులుకు అదే గ్రామంలో నివాసముంటున్న అతడి అక్క అంజమ్మ మధ్య కొంతకాలంగా భూ తగాదా నడుస్తోంది. తన అక్కను అడ్డుతప్పిస్తే ఆస్తి తన సొంతమవుతుందని సైదులు భావించాడు. ఈ మేరకు సోమవారం ఉదయం పనికి వెళ్తున్న తన అక్కపై సైదులు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యచేశాడు. ఈ హత్యకు సంబంధించి సైదులుతో పాటు అతడి భార్య ధనలక్ష్మి, కుమారుడు శివతేజ, బావమరిది కొండ భీమయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం బృందావనపురం గ్రామంలో కొండ భీమయ్య ఇంట్లో సైదులు, ధనలక్ష్మి, శివతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండ భీమయ్య పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఆత్మకూర్(ఎస్) ఎస్‌ఐ ఐలయ్య తదితరులు ఉన్నారు.
ఫ నిందితుడితో పాటు అతడి భార్య, కుమారుడి అరెస్టు
ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్


