కేతేపల్లి : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు లారీల కొరతతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఆ సమస్యను తీర్చడంలో విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కేతేపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కేంద్రాలు ప్రారంభించి రెండు మాసాలు కావొస్తున్నా సీఎం కానీ, సంబంధిత శాఖ మంత్రి గానీ మిల్లర్లతో సమీక్ష నిర్వహించలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఇంకా భారీగా పేరుకుపోయాయన్నారు. మిల్లుల వద్ద లారీల్లో ధాన్యం దిగుమతి కాక, కేంద్రాలకు లారీలు రాక రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్‌ఎస్ పక్షాన రైతుల ఇబ్బందులపై ఇటీవల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించినా కొనుగోళ్లు వేగవంతంగా సాగడం లేదన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


