నల్లగొండ : గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.లక్ష విలువ గల 2.2 కేజీల గంజాయి, 2 కత్తులు, 3 ఫోన్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. కనగల్‌లోని జీఎల్ గార్డెన్ దగ్గరలో గల వేప చెట్టు వద్ద ఐదుగురు వ్యక్తులు ఒక మోటార్ సైకల్‌పై ఉండి గంజాయి పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కనగల్ ఎస్‌ఐ కె.రాజీవ్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులైన బొడ్డు చందు, కానుగు సాయిరామ్, జిల్లా చందు, చాడ క్రాంతికుమార్, బొమ్మరగోని అంజి అలియాస్ నిరంజన్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ నిందితులు మూడు నెలల నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్నామని హైదరాబాద్‌లోని మన్నీ అనే మహిళ నుంచి కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు తెలిపారన్నారు. కేసును ఛేదించి గంజాయిని నిందితులను అరెస్టు చేసిన కనగల్ ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
చివరి మజిలీలో
మేమున్నామంటూ..
రామగిరి (నల్లగొండ) : నల్లగొండలో ఓ అనాథ మృతదేహానికి సేవా భారతి ఆధ్వర్యంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. సేవా భారతి కార్యకర్తలు కుటుంబ సభ్యుల్లా నిలబడి చివరి వీడ్కోలు పలికారు. మనిషి చివరి ప్రయాణానికి గౌరవం ఇవ్వడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది. కార్యక్రమంలో సేవా భారతి జిల్లా అధ్యక్షుడు శిరీష్, భీమనపల్లి శ్రీకాంత్, రాజు, గణేష్, ఎలేందర్, క్రాంతి, రాము పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న గ్రామస్తులు..
నూతనకల్ : బతుకుదెరువు కోసం వచ్చి మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ఆ గ్రామస్తులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోను(53) పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం మండల కేంద్రానికి వలస వచ్చాడు. మండల కేంద్రంలో పానిపురి బండి నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురై శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి గ్రామంలో ఇల్లు లేకపోవడం.. మృతదేహాన్ని సొంత రాష్ట్రానికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామంలోనే వైకుంఠ ధామంలో ఉంచారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇమ్మారెడ్డి రాజాబహుదూర్‌రెడ్డి రూ.10వేలు, మరికొందరు తమకు తోచిన సహాయం అందించి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.


