నడిగూడెం : గత పదేళ్లుగా క్రీడాకారులకు వివిధ క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నడిగూడెం మండల కేంద్రానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు పల్లపు నాగేశ్వరరావు. ప్రస్తుతం ఆయన మోతె మండలం తుమ్మగూడెం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్యచౌదరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గత పదేళ్లుగా వేసవిలో ప్రత్యేక క్రీడా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో నడిగూడెంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన బృందావనపురం, వేణుగోపాలపురం, చాకిరాల, చెన్నకేశవాపురంతో పాటు మునగాల మండలంలోని కృష్ణానగర్, నారాయణగూడెం గ్రామాలకు చెందిన విద్యార్థులకు పాల్గొంటున్నారు. పోలీసుల ఉద్యోగాలకు సన్నద్దమయ్యే అభ్యర్దులకు సైతం ఆయన ఉచితంగా శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పిస్తున్నారు. ఆయన ద్వారా శిక్షణ పొందిన పలువురు పోలీసు ఉద్యోగాలు సైతం సాధించారు. వేసవి వచ్చిందంటే చాలు నడిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నాగేశ్వరరావు పేరు గుర్తుకు రావాల్సిందే. ప్రస్తుత వేసవిలో కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం క్రీడాకారులతో క్రీడా ప్రాంగణం కళకళలాడుతోంది.
ఫ పదేళ్లుగా క్రీడాకారులకు
ఉచిత శిక్షణ ఇస్తున్న
వ్యాయామ ఉపాధ్యాయుడు
ఫ పోలీసు ఉద్యోగార్థులకు
సైతం మెళకువలు


