ఇద్దరు దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు దొంగల అరెస్ట్‌

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

చిట్యాల : చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్‌ చేసి వారి నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు, పంచలోహా విగ్రహాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి తెలిపారు. చిట్యాల పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు.

జైలులో పరిచయంతో..

మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయకు చెందిన నీలపు నీలయ్య(26) బీకాం కంప్యూటర్స్‌ పూర్తిచేసి లాజిస్టిక్స్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. జల్సాలకు అలవాటుపడి చోరీ కేసులో జైలుకు వెళ్లటంతో ఉద్యోగం కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ గ్రామానికి చెందిన బత్తిని నరేష్‌ అలియాస్‌ లవ్లీ నరేష్‌(29) వాహనాల చోరీ కేసులో జైలుకు వెళ్లాడు. వీరిద్దరికి జైలులో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత వారిద్దరు హైదరాబాద్‌లో రూం అద్దెకు తీసుకున్నారు. ఇద్దరు కలిసి హైదరాబాద్‌, మేడ్చల్‌, దుండిగల్‌, అమీన్‌పూర్‌, సంగారెడ్డి, నల్లగొండ జిల్లా చిట్యాలలో బైక్‌లు, స్కూటర్లు చోరీ చేశారు. అంతేకాకుండా మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోని అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీకి పాల్పడి విలువైన పంచలోహా విగ్రహాన్ని, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

చిట్యాలలో పట్టుబడిన దొంగలు..

నరేష్‌, నీలయ్య స్కూటర్‌పై మంగళవారం ఉదయం విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారి మీదుగా వెళ్తుండగా.. నల్లగొండ జిల్లా చిట్యాల రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డు వద్ద పోలీసుల వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారిని విచారించగా ఆరు ద్విచక్ర వాహనాలు, పంచలోహ దుర్గాదేవి విగ్రహం, టీవీ, ల్యాప్‌టాప్‌, ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. చోరీ చేసిన సొత్తును వారు హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్న రూంలో ఉంచినట్లు తెలపడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.10లక్షలకు పైగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవటంలో చురుకుగా వ్యవహరించిన చిట్యాల ఎస్‌ఐ రవికుమార్‌ను డీఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ నాగరాజు, ఎస్‌ఐ రవికుమార్‌ పాల్గొన్నారు.

ఫ రూ.10లక్షలకు పైగా సొత్తు స్వాధీనం

Advertisement
 
Advertisement
Advertisement