రామగిరి(నల్లగొండ): అట్రాసిటి కేసులో ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి ఎన్. రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. చందంపేట మండలం గన్నెపల్లి గ్రామానికి చెందిన నక్క పర్వతాలు డిండి మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నారు. తనను వివాహం చేసుకోవాలని యువతి కోరగా.. పెళ్లికి నిరాకరించడంతో పాటు పర్వతాలు, అతడి అత్త నీలం సత్తమ్మ కలిసి యువతిని కులం పేరుతో దూషించారు. దీంతో సదరు యువతి 2013లో డిండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహ వాదనలతో ఏకీభవించిన జడ్జి ఎన్. రోజారమణి.. నిందితులు నక్క పర్వతాలుకు పలు సెక్షన్ల కింద 11 ఏళ్ల జైలుశిక్ష, రూ.500 జరిమానా, నీలం సత్తమ్మకు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు కానున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.
చెక్‌డ్యాంలో పడి
ఎద్దు మృతి
అడ్డగూడూరు : మండల పరిధిలోని చిన్నపడిశాల గ్రామంలో బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం నీళ్లలో పడి ఎద్దు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. వివరాలు.. అడ్డగూడూరు మండలం జానకీపురం గ్రామనికి చెందిన గోడిశాల సోమయ్య ఎద్దు చెక్‌డ్యాంలో నీళ్లు తాగడానికి వెళ్లి ప్రమాదవాశాత్తు నీట మునిగి మృతిచెందింది. ఎద్దు విలువ సూమారు రూ.80వేలు ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
వ్యక్తి అదృశ్యం
కొండమల్లేపల్లి : భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. వివరాలు.. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన గండూరి రఘుకుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన తన భార్యతో గొడవ పడి సోమవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎంత వెతికినా రఘుకుమార్ ఆచూకీ లభించకపోవడంతో అతడి భార్య శైలజ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జూదరుల అరెస్ట్
చిలుకూరు : మండలంలోని ఆర్లెగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై మంగళవారం సూర్యాపేట జిల్లా స్పెషల్ బ్రాంచి పోలీసులు దాడి చేపి నలుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పోలీసులను చూసి పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ.6500 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బైక్ చోరీ
నాగారం : ఎరువుల దుకాణం ముందు పార్కింగ్ చేసిన బైక్ చోరీకి గురైంది. ఈ ఘటన నాగారం మండలం నాగారం బంగ్లాలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండల కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)గా పనిచేస్తున్న ఎన్. సాయిరాజ్ సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణం ముందు తన బైక్‌ను పార్కింగ్ చేసి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


