ధాన్యం విక్రయించిన నగదు అపహరణ | - | Sakshi
Sakshi News home page

ధాన్యం విక్రయించిన నగదు అపహరణ

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

బ్యాంకు నుంచి డ్రా చేసి ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టిన రైతు

దారిలో ముంజలు కొంటుండగా..

చోరీ చేసిన గుర్తుతెలియని వ్యక్తి

హుజూర్‌నగర్‌ : ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టిన నగదును అపహరించిన ఘటన మంగళవారం హుజూర్‌నగర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ మండలం అంజలీపురం గ్రామానికి చెందిన రైతు కార్లపూడి కాంతారావు ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు అతడి యూనియన్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో జమయ్యాయి. మంగళవారం రూ.80 వేలు డ్రా చేసుకుని తన ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టాడు. కానీ డిక్కీకి తాళం లేదు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో ద్విచక్ర వాహనం దిగి తాటిముంజలు కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాడు. తీరా ఇంటికి వెళ్లి చూసేసరికి డిక్కీలో ఉండాల్సిన రూ.80 వేల నగదు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంక్‌ అధికారులను సంప్రదించి పట్టణంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. తాటిముంజలు కొనే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి డిక్కీలోని డబ్బులు దొంగించినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ రాములునాయక్‌ తెలిపారు.

మూగజీవాలను

తరలిస్తున్న డీసీఎం పట్టివేత

చౌటుప్పల్‌ : అక్రమంగా మూగజీవాలను తరలిస్తున్న డీసీఎంను చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్‌ తన డీసీఎంలో ఏపీలోని జగ్గంపేట సంత నుంచి మూగ జీవాలను హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు డీసీఎంను ఆపగా.. అందులో ఆవులు 10, లేగ దూడలు 5, ఎద్దులు 4, కోడె దూడలు 4 ఉన్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించి గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement