మోదీ ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మోదీ ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలి

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

చౌటుప్పల్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడం మానుకొని విదేశీ వ్యవహారాలను చక్కదిద్దాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హితవు పలికారు. చౌటుప్పల్‌లో మంగళవారం నిర్వహించిన సీపీఎం జిల్లా విస్త్రతస్థాయి సమావేశానికి ఆయన హాజరై అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విదేశీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ఉత్పత్తులతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలకు యుద్ధం కారణమైనప్పటికీ ఇందులో ప్రధానమంత్రి వైఫల్యం కూడా ఉందన్నారు. గతంలో చట్టసభల్లో చర్చలు జరుగుతున్నాయంటే ప్రజలకు ఎంతో మేలు జరిగేదని, ప్రస్తుతం చట్టసభలు ఏర్పాటు చేసి ప్రజలు సాధించుకున్న హక్కులను హరించేందుకు చట్ట సవరణలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని 29చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌కోడ్‌లను అమలు చేస్తున్నారని, తద్వారా ప్రజల హక్కులపై దాడి జరిగిందన్నారు. డీలిమిటేషన్‌ పేరిట తమకు అనుకూలమైన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పెంచుకునేందుకు మహిళా బిల్లును బూచిగా పెట్టిందని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు మినహా ఇతర హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌. వీరయ్య మాట్లాడుతూ ఇరాన్‌ దేశంపై ఇజ్రాయిల్‌, అమెరికా దేశాలు దాడులు చేస్తుంటే కనీసం ఖండించలేని దుస్థితిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారని తెలిపారు. అమెరికాతో ఉన్న అంబానీ, అదానీల వ్యాపారాలను కొనసాగించేందుకే ట్రంప్‌కు దాసోహం అయ్యారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి.జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి, కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు, ఎం.డి.పాష పాల్గొన్నారు.

ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

Advertisement
 
Advertisement
Advertisement