చౌటుప్పల్ : మండలంలోని తూప్రాన్‌పేట గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్‌పేట గ్రామానికి చెందిన బక్కతట్ల జంగయ్య(57) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం మంగళవారం ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని భాస్కర్ ఆగ్రో కెమికల్ పరిశ్రమ వద్దకు వెళ్లగానే గుర్తుతెలియని బిచ్చగాడు అకస్మాత్తుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న జంగయ్య ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. బిచ్చగాడికి సైతం గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
చికిత్స పొందుతూ..
చౌటుప్పల్ : బాత్‌రూంలో కాలుజారి కిందపడి తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని రత్నానగర్‌కాలనీకి చెందిన కొత్తూరు నరేందర్(62) కూలీ పనులు చేస్తుంటాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోని బాత్‌రూంలో ఆయన కాలుజారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడు నాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ఎయిమ్స్‌లో రక్తదాన శిబిరం
భువనగిరి(బీబీనగర్) : అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బీబీనగర్ ఎయిమ్స్‌లో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతకుముందు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ డాక్టర్ లత, మెడికల్ సూపరింటెండెంట్ కుల్దీప్ జీబీ, డిప్యూటీ డైరెక్టర్ రజనీస్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితా అగర్వాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


