ఇందిరమ్మ ఇంట.. బిల్లుల తంటా | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇంట.. బిల్లుల తంటా

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

వివిధ పథకాల నిధుల విడుదలలో జాప్యం

ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిధులను అనుసంధానం చేసింది.అయితే వీటి విడుదలలోనూ జాప్యం జరుగుతోంది.ఉపాధి హామీ 90 రోజుల పనికి సంబంధించి రూ. 27 వేలు రావాల్సి ఉండగా, నెలల తరబడి ఫొటోలు దిగుతున్నా పూర్తిస్థాయి డబ్బులు జమ కావడం లేదు.ఆవాస్‌ యోజన కింద రావాల్సిన రూ. 21 వేలు ఆలస్యం అవుతున్నాయి.స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ. 12 వేల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

సాక్షి యాదాద్రి: సొంతింటి కలను నిజం చేసుకునేందుకు అప్పోసొప్పో చేసి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్న నిరుపేదలకు ఇప్పుడు బిల్లుల కష్టాలు మొదలయ్యాయి. ఇంటి నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన తుది విడత నిధులు అందకపోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు పూర్తయినా, బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతుండటంతో అరువు తెచ్చిన సామగ్రికి డబ్బులు చెల్లించలేక, వడ్డీలు కట్టలేక లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

బిల్లుల కుదింపు

నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలను వందశాతం సబ్బిడీతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం తొలుత నాలుగు దశల్లో బిల్లులు ఇస్తామని ప్రకటించింది. వీటిలో పునాది స్థాయిలో రూ. 1 లక్ష, పిల్లర్ల నిర్మాణం తర్వాత రూ. 2 లక్షలు, స్లాబ్‌ వేసిన తర్వాత ఇచ్చే మూడో బిల్లును రూ. 2 లక్షల నుంచి రూ. 1.40 లక్షలకు కుదించింది. నాలుగో దశలో రూ.60వేలను వివిధ పథకాలకింద ఇస్తారు.

9,618 ఇళ్లు మంజూరు

జిల్లాలోని ఆలేరు, భువనగిరి, తుంగుతుర్తి, మునగోడు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో గత సంవత్సరం తొలివిడత 9618 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో 2087 ఇళ్లు పూర్తి అయ్యాయి. ఆలేరు నియోజకవర్గం ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో ప్రథమ స్థానం, భువనగిరి ద్వితీయస్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇళ్ల నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా తుది బిల్లులు రావడంలేదు. దీంతో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

బిల్లుల కోసం ఎదురు చూపులు

ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు తెలిసిన వారి వద్ద అప్పులు చేయడం, సామగ్రిని అరువు కూడా తెచ్చుకున్నారు. నిర్మాణం పూర్తయితే బిల్లులు వస్తాయని, ఆ డబ్బుతో అప్పులు తీర్చవచ్చని ఆశించారు. కానీ, జిల్లాలో ఇప్పటికే 2,087 ఇళ్లు పూర్తయినా తుది బిల్లులు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో అధికారులను నిత్యం వాకబు చేస్తున్నారు.

ప్రారంభించని ఇళ్లు రద్దు

నిర్మాణాలు ప్రారంభించని ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 1142 ఇళ్లు రకరకాల కారణాలతో ప్రారంభం కాలేదు. వీటిని అధికారులు రద్దు చేస్తున్నారు.

ఫ ఇల్లు పూర్తయినా అందని తుది బిల్లు

ఫ ఇప్పటివరకు పూర్తయినవి 2087

ఫ అప్పుల ఊబిలో లబ్ధిదారులు

ఫ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

Advertisement
 
Advertisement
Advertisement