ఇళ్ల గణన ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల గణన ప్రారంభం

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

సరైన వివరాలు నమోదు చేయాలి

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

గృహ గణనలో భాగంగా ఎన్యుమరేటర్లు సరైన వివరాలు నమోదు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. గృహ గణన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ .. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 30, 31 వార్డుల్లో సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న గృహగణన ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. హెచ్‌ఎల్‌బీ సరిహద్దుల నిర్ధారణ, ఇంటింటి సమాచార సేకరణ, మ్యాపుల ఆధారంగా ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ తదితర అంశాలపై అధికారులు, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు సూచనలు చేశారు. జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. గృహగణన ప్రక్రియ పారదర్శకంగా, కచ్చితత్వంతో పూర్తిచేయడం ద్వారా భవిష్యత్‌ ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజలు కూడా జనగణన సిబ్బందికి సహకరించి సరైన సమాచారం ఇవ్వాలని కోరారు.

భువనగిరిటౌన్‌ : జనగణన–2027 మొదటి దశ ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి గృహ గణనకు శ్రీకారం చుట్టారు. జూన్‌ 9 వరకు నెల రోజుల పాటు సాగే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేటర్లు జిల్లాలోని ప్రతి గడపను తట్టనున్నారు. గృహ గణనతో పాటు నివాస వసతులు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను సేకరించనున్నారు. కలెక్టర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, గణన తీరును పరిశీలించారు.

పకడ్బందీగా యంత్రాంగం ఏర్పాట్లు

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఇళ్ల గణన సజావుగా సాగేందుకు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లాను మొత్తం 1,748 బ్లాకులుగా విభజించి, ప్రతి బ్లాకుకు ఒక ఎన్యుమరేటర్‌ చొప్పున మొత్తం 1,461 మందిని నియమించింది. వీరి పనితీరు పర్యవేక్షణకు 257 మంది సూపర్‌వైజర్లను కేటాయించారు. ఎన్యుమరేటర్లు తొలి మూడు రోజులు తమకు కేటాయించిన పరిధిలోని ఇంటి నంబర్లను సరిచూసుకోవడం, సరిహద్దులను గుర్తించడం వంటి పనులు పూర్తి చేస్తారు. నాలుగో రోజు నుంచి మొబైల్‌ యాప్‌ ద్వారా అసలైన డేటా సేకరణ ప్రారంభమవుతుంది.

ముగిసిన స్వీయ గణన

ఈసారి జనగణనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన ప్రక్రియ ఆదివారం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 6,259 మంది పౌరులు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకున్న వారు ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు తమ రిఫరెన్స్‌ ఐడీని చూపిస్తే సరిపోతుంది.

వలసలు.. ఇతర ప్రాంతాల్లో

నమోదుపై స్పష్టత

జిల్లాలో నివసిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల వివరాల నమోదుపై అధికారులు కీలక వివరణ ఇచ్చారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నమోదు చేసుకున్నా, తుది గణాంకాల ప్రకారం వారి వివరాలు సొంత జిల్లాల ఖాతాలోకే చేరుతాయి. అదేవిధంగా ఈ జిల్లాకు చెందిన వారు ఉపాధి, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాల్లో ఉండి అక్కడ వివరాలు నమోదు చేసినా, అవి జిల్లా జనాభా లెక్కల్లోకే వస్తాయని అధికారులు తెలిపారు.

గడపగడప లెక్క

ఫ రంగంలోకి 1,461 మంది ఎన్యుమరేటర్లు, 257 మంది సూపర్‌వైజర్లు

ఫ ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ

ఫ జూన్‌ 9వ తేదీ వరకు సర్వే

ఫ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement
 
Advertisement
Advertisement