మహిళా కమిషన్‌ సభ్యురాలిగా కాసోజు శంకరమ్మ | - | Sakshi
Sakshi News home page

మహిళా కమిషన్‌ సభ్యురాలిగా కాసోజు శంకరమ్మ

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

మోత్కూరు : మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి కాసోజు శంకరమ్మ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మితో పాటు ఏడుగురు సభ్యులను నియమించారు. ఏడుగురు సభ్యులలో కాసోజు శంకరమ్మ ఒకరు.

రేపు పాలిసెట్‌

యాదగిరిగుట్ట: ఈ నెల 13వ తేదీన పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్‌ ఎన్‌.రామానాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 4 కేంద్రాలు భువనగిరిలో, 2 కేంద్రాలు యాదగిరిగుట్టలో సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ ఆరు కేంద్రాల్లో 1,692 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలి పారు. పాలిసెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కోఆర్డినేటర్‌ రామానాయుడు తెలిపారు.

నేడు హనుమాన్‌ జయంతి వేడుకలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణి చెంత ఉన్న క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి వారి ఆలయంలో, అనుబంధ పాతగుట్ట ఆలయాల్లో మంగళవారం హనుమాన్‌ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఉదయం 9గంటలకు అష్టోత్తర శతమన్యుసూక్త పారాయణాలు, అభిషేకం, లక్ష తమలపాకులతో నాగవళ్లీ అర్చన, మహా నివేదన వంటి పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ భవానీ శంకర్‌ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక ప్రధానాలయంలోని ఆంజనేయస్వామికి అంతరంగికంగా హనుమాన్‌ జయంతి పూజలు జరిపిస్తామని తెలిపారు. విష్ణు పుష్కరిణి వద్ద ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించే లక్ష తమలపాకుల అర్చనలో పాల్గొనే భక్త దంపతులకు రూ.516 టిక్కెట్‌ రుసుము ఉంటుందని పేర్కొన్నారు.

పబ్లిక్‌ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

భువనగిరిటౌన్‌ : హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్స్‌ (రామంతాపూర్‌, బేగంపేట)లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందేందుకు జిల్లాలోని గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి ఇన్‌చార్జ్‌ అధికారి జయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 2019 జూన్‌ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ 2 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు భువనగిరిలోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వచ్చిన దరఖాస్తుల నుంచి మే 22న కలెక్టర్‌ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన విద్యార్థుల ఎంపిక ఉంటుందని మరిన్ని వివరాలకు 9985956225 లేదా 9849704132 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.

యువతకు ఉచితంగా ఉపాధి శిక్షణ

భువనగిరిటౌన్‌ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, టీం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి పి.సాహితి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 12రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి, 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.

నవజాత శిశువుల మనుగడకే ఎన్‌ఎన్‌ఎస్‌

భువనగిరి(బీబీనగర్‌): బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో సోమవారం జాతీయ ఎన్‌ఆర్‌పీ వేడుకల్లో భాగంగా ప్రాథమిక నవజాత శిశు పునరుజ్జీవన వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రిలకు చెందిన సుమారు 55 మంది నర్సులు హాజరయ్యారు. డాక్టర్‌ ఎస్‌కె మొహనసుందరి,ఎరా దీపిక దయాళ్‌ నర్సులకు ప్రసవానికి సన్నద్ధత, నవజాత శిశువు సంరక్షణ, పునరుజ్జీవ ప్రక్రియలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్‌ తనిగైనాధన్‌,డాక్టర్‌ గుర్రార్ష్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement