రసాయన జలాల శుద్ధి | - | Sakshi
Sakshi News home page

రసాయన జలాల శుద్ధి

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

రామన్నపేట: చేనేత వస్త్రాల అద్దకంలో వెలువడే రసాయన జలాల కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు రామన్నపేట మండలం సిరిపురం గ్రామం వేదికగా సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. రసాయన, మురుగునీటిని శాసీ్త్రయ పద్ధతిలో శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక నీటిశుద్ధి ప్లాంట్‌ ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ పైలట్‌ ప్రాజెక్టు ప్రస్తుతం విజయవంతంగా ట్రయల్‌ రన్‌ జరుపుకుంటోంది.

2024లో శంకుస్థాపన

సిరిపురం చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. చేనేత వస్త్రాల తయారీలో వివిధ డిజైన్లకోసం సహజసిద్ధమైన వాటితో పాటు రసాయన రంగులను ఉపయోగిస్తుంటారు. అలా ఉపయోగించిన కాలుష్య కారకమైన నీరు మురుగు కాలువల గుండా ప్రవహించి సమీపంలోని కుంటలోకి చేరుతుంది. దీని కారణంగా కుంటలోని నీటితోపాటు భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయి. దీనికి చెక్‌ పెట్టేందుకు గ్రామంలో హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) వారు కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వారి రూ 2 కోట్ల ఆర్థిక సహకారంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 2024 మార్చి 10వ తేదీన ఐఐసీటీ డైరెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, అప్పటి కలెక్టర్‌ జండగే హనుమంత్‌ దీని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చేనేత వస్త్రాల తయారీ కోసం రంగుల అద్దకంలో వాడిన రసాయన నీటిని శుద్ధిచేసి తిరిగి వాడుకోవడం, జల కాలుష్యంను తగ్గించాలనే లక్ష్యంతో ఐఐసీటీ వారు దేశంలోనే మొట్టమొదటగా పైలట్‌ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేశారు.

ఫ సిరిపురంలో ఐఐసీటీ ఆధ్వర్యంలో రూ.2కోట్లతో పైలట్‌ ప్రాజెక్టు కింద ఏర్పాటు

ఫ దేశంలోనే తొలి రసాయన నీటి శుద్ధి ప్లాంట్‌

ఫ ప్రారంభానికి సిద్ధం

ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ దశలో..

గ్రామంలోని మెయిన్‌రోడ్డు వెంట అండర్‌గ్రౌండ్‌ డ్రెయిన్‌ను నిర్మించారు. గ్రామంలో రంగుల అద్దకంలో వాడే రసాయననీటితో పాటు, మురుగునీరు అండర్‌గ్రౌండ్‌ డ్రెయిన్‌లో కలిసే విధంగా ఏర్పాటు చేశారు. నీరంతా ఊరకుంట వద్ద ఏర్పాటు చేసిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వద్దకు చేరుతుంది. ప్రారంభంలో డ్రెయిన్‌గుండా వచ్చిన నీటిలోని వ్యర్థాలు, చెత్త, ప్లాస్టిక్‌ వస్తువులు, ఆకులను మొదటి బ్లాక్‌లో శుద్ధి అయిన తరువాత సంప్‌లోకి చేరుతుంది. నీటిలోని కాలుష్య కారక పదార్థాలు, రసాయనాలను వివిధ దశల్లో బ్యాక్టీరియా సహకారంతో శుద్ధి చేస్తారు. చివరి దశలో నీటిని పరీక్షించి శాసీ్త్రయ ప్రమాణాలకు అనుగుణంగా నీరు శుద్ధి అయితే బయటకు పంపుతారు. లేకుంటే తిరిగి రీ ట్రీట్‌ చేస్తారు. ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. త్వరలో అధికారికంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ ప్లాంట్‌ విజయవంతం అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ విధమైన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement