దేవుడి వరం.. అందుకే ఏడుస్తాం మనం | - | Sakshi
Sakshi News home page

దేవుడి వరం.. అందుకే ఏడుస్తాం మనం

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

ఫ్రెండ్స్‌ వేసవి సెలవుల్లో నేను మా అమ్మమ్మ ఇంటికి వచ్చాను. ఆమె నాకు ఒక చెప్పిన ఉల్లిగడ్డ కథ బాగా నచ్చింది. మీకు కూడా చెబుతున్నాను. చిలుకూరు : అనగనగా ఒక ఊర్లో ఉల్లిగడ్డ, టమాట, ఉప్పు మంచి స్నేహితులు. వారు ముగ్గురు ఒక రోజు గుడికి వెళ్దామని ఊరి నుంచి బయల్దేరుతారు. దారిలో ఒక వాగు దాటాల్సి వస్తుంది. వాగు దాటుతుండడంతో ఉప్పు కరిగిపోతుంది. దీంతో తమ స్నేహితుడు మరణించాడని టమాట, ఉల్లిగడ్డ ఏడుస్తాయి. ఏడుస్తూనే టమాట, ఉల్లిగడ్డ గుడికి వెళ్తాయి. గుడి దగ్గర ఎక్కువగా రద్దీ ఉండడంతో జనం టమాటాను తొక్కడంతో అది కూడా చనిపోతుంది. దీంతో ఒంటరైన ఉల్లిగడ్డ చాలాసేపు ఏడుస్తుంది. అ తర్వాత దేవుడి దగ్గరకు వెళ్లి దేవుడు ప్రత్యక్షం కావాలని కోరుకుంటుంది. దీంతో దుఖంలో ఉన్న ఉల్లిగడ్డను ఓదార్చేందుకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. వెంటనే ఉల్లిగడ్డ దేవుడుతో మాట్లాడుతూ.. ఉప్పు చనిపోతే నేను, నా స్నేహితుడు టమాట ఏడ్చాం. టమాట చనిపోతే నేను ఒక్క దానిని ఏడ్చాను. ఒకవేళ నేను కూడా చనిపోతే ఎవరు ఏడుస్తారని దేవుడిని అడిగింది. దీంతో దేవుడు నిన్ను ఎవరు చంపితే వారు ఏడుస్తారని దేవుడు ఉల్లిగడ్డకు చెబుతాడు. అది నీకు ఇస్తున్న వరం అని దేవుడు మాయమైపోతాడు. అందుకే మన ఇంట్లో ఉల్లిగడ్డ కోసినప్పుడు కళ్ల వెంట నీళ్లు వస్తాయని మా అమ్మమ్మ చెప్పింది. అంతేకాక తల్లి లాగనే ఉల్లి కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పింది.

విజ్ఞానం.. వినోదం

ఫ వేసవి సెలవుల్లో కంప్యూటర్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్చుకుంటున్న విద్యార్థులు

భువనగిరి : సాధారణంగా వేసవి సెలవుల్లో విద్యార్థులంతా ఆటలు ఆడుతూ.. అమ్మమ్మ ఊరికి వెళ్లి సరదాగా గడుపుతుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి అని భావించిన కొందరు విద్యార్థులు కంప్యూటర్‌, టైపింగ్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో 6 నుంచి 14 ఏళ్ల లోపు విద్యార్థులు ఎక్కువగా ఈ శిక్షణ కేంద్రాల్లో చేరుతున్నారు. టైపింగ్‌ నేర్చుకోవడం వల్ల కంప్యూటర్‌ కీబోర్డుపై పట్టు వస్తుందని భావించి ముందుగా టైపింగ్‌ ఎంచుకుంటున్నారు. పిల్లల వయస్సు, వారి జ్ఞానానికి అనుగుణంగా శిక్షణ సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. కంప్యూటర్‌, టైపింగ్‌ శిక్షణ కేంద్రాలు బిజీబిజీగా ఉంటున్నాయి.

టైపింగ్‌ నేర్చుకుంటున్నా..

వేసవి సెలవులు వృథా చేయకూదడని నిర్ణయించుకున్నాను. ఏదో ఒక కోర్సు నేర్చుకోవాలని కంప్యూటర్‌, టైపింగ్‌ నేర్చుకుంటున్నా. మరోవైపు సమయం దొరికినప్పుడల్లా బ్యాడ్మింటన్‌ కూడా ఆడుతున్నా.

– మెర్లిన్‌, 6వ తరగతి, భువనగిరి

కంప్యూటర్‌ శిక్షణ బాగుంది

ఉదయం స్నేహితులతో ఆడుకుంటూ నే.. సాయంత్రం రెండు గంటల పాటు కంప్యూటర్‌ నేర్చు కోవడం కోసం సమయం కేటాయిస్తున్నా. కోచింగ్‌ సెంటర్‌లో కంప్యూటర్‌ నేర్చుకోవడం బాగుంది.

– అమ్జ, 5వ తరగతి, భువనగిరి

స్పోకెన్‌ ఇంగ్లిష్‌పై పట్టు..

చిట్యాల : పట్టణానికి చెందిన లెక్చరర్‌ కందుల గణేష్‌ ప్రతి వేసవిలో నామమాత్రపు ఫీజు తీసుకుని స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో ఆయన వద్దకు ప్రతిరోజు సుమారు 30మందికి పైగా విద్యార్థులు హాజరవుతూ ఇంగ్లిష్‌ మాట్లాడే నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఇంగ్లిష్‌లో రోజువారి సంభాషణలు, ఉచ్ఛారణ, వాక్య నిర్మాణం, ఇంటర్వ్యూ వంటి అంశాలపై లెక్చరర్‌ గణేష్‌ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement