గరిడేపల్లి : టీజీ పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష మే 13న జరగనుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వ్యవసాయ మరియు ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ చేరవచ్చని గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్త నరేష్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ మరియు ఉద్యాన విశ్వవిద్యాలయాల కింద రెండు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్‌లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి.
హార్టికల్చర్ పాలిటెక్నిక్..
గడ్డిపల్లిలోని ఘంటా గోపాల్‌రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయ పరిధిలో ఉంది. ఈ కాలేజీలో రెండేళ్ల డిప్లొమా కోర్సు అందిస్తున్నారు. ఉద్యాన డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
● ప్రభుత్వ శాఖల్లో ఉద్యాన విస్తరణ అధికారి మరియు ఫీల్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు.
● ఆయిల్ పామ్ కంపెనీల్లో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా, విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందుల కంపెనీల్లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేయవచ్చు.
● సొంతగా నర్సరీల స్థాపన, పురుగు మందుల దుకాణాలు, సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
● ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.
● పరిశోధన మరియు ఉన్నత విద్య (బీఎస్సీ హార్టికల్చర్) కొనసాగించేందుకు హార్టిసెట్ ద్వారా అగ్రశ్రేణి ఉద్యాన విశ్వవిద్యాలయాలు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. లేదా డిగ్రీ కోర్సుల్లో చేరాలంటే లేటరల్ ఎంట్రీ ద్వారా చేరి ఉన్నత విద్యను కొనసాగించవచ్చు.
వ్యవసాయ పాలిటెక్నిక్..
కంపాసాగర్‌లోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉంది. ఇందులోనూ రెండేళ్ల డిప్లొమా కోర్సు అందిస్తున్నారు. వ్యవసాయ డిప్లొమా కోర్సు ద్వారా విద్యార్థులు వ్యవసాయ శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాల్లో శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని పొంది ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
వ్యవసాయ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు స్వయంగా వ్యవసాయ పరిశ్రమలు, నర్సరీలు ప్రారంభించవచ్చు.
సీడ్ కంపెనీలలో టెక్నికల్ అసిస్టెంట్, వ్యవసాయ పరికరాల కంపెనీలలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయవచ్చు.
ప్రభుత్వ నియమించే అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఏఈఓ) చేరవచ్చు.
అదేవిధంగా డిప్లొమా పూర్తయిన తర్వాత విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చర్(అగ్రిసెట్) విద్యను కొనసాగించవచ్చు. లేదా డిగ్రీ కోర్సులకు లేటరల్ ఎంట్రీ ద్వారా చేరి ఉన్నత విద్యను కొనసాగించవచ్చు.
పాలీసెట్ ద్వారా వ్యవసాయ, ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం


