చౌటుప్పల్ : రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట శివారులో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన గురిజాల రాజశేఖర్(36) హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాజశేఖర్ బంధువు చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన శుభకార్యానికి అతడు వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో తూప్రాన్‌పేట శివారులో ద్విచక్ర వాహనం నిలిపి.. విజయవాడ మార్గంలో ఉన్న చాచా దాబా వద్దకు వెళ్లి టీ తాగి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వచ్చి రాజశేఖర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ద్విచక్ర వాహనం అపహరణ
వలిగొండ : ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల కేంద్రానికి చెందిన బతిని శెట్టయ్యగౌడ్ తన ద్విచక్ర వాహనాన్ని ఆదివారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. సోమవారం ఉదయం చూసేసరికి ద్విచక్ర వాహనం కనిపించలేదు. దీంతో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఫ రూ.1.60లక్షల నగదు అపహరణ
మోత్కూరు : తాళం వేసిన ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నగదు అపహరించారు. ఈ ఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బుజిలాపురం గ్రామానికి చెందిన దొంతి మత్స్యగిరి శనివారం తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వలిగొండ మండలం మల్లేపల్లి గ్రామంలో బొడ్రాయి పండుగకు బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు మత్స్యగిరి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచిన రూ.1,60,000 నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం మత్స్యగిరి ఇంటి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు.


