పెద్దవూర, త్రిపురారం : రైతులు పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గుతుంది. పంట మార్పిడి వల్ల కలిగే లాభాలపై కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కంపాసాగర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, పెద్దవూర మండల వ్యవసాయాధికారి సత్యనారాయణ సలహాలు, సూచనలు వారి మాటల్లోనే..
భూసారం పెరుగుతుంది..
నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. చీడపీడలు దూరమవుతాయి. శిలీంధ్ర వ్యాధులను దూరం చేయవచ్చు. బీజాలు, వాటి అవశేషాలు, వానపాముల వృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు.
పాటించాల్సిన మెళకువలు
పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటల్ని ఎంపిక చేసుకోవాలి. శనగ, బొబ్బెర, పెసర, మినుము పంటలను వేసుకోవడం వలన నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని వలన కలుపు మొక్కలను నివారించవచ్చు. వరి తర్వాత మినుము, పెసర, వేరుశనగ, చెరకు వేయడం వలన సుడిదోమ, తుంగ్రో వైరస్‌ను నివారించవచ్చు. పత్తి సాగు చేసిన నేలలో మినుము, పెసర వేయడం వలన తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలి. దీని వలన వేరుశనగను ఆశించే ఆకుముడత ఉధృతిని తగ్గించవచ్చును. పసుపు తర్వాత వరి, జొన్న సాగు చేసుకోవాలి. దీనివలన నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. నులిపురుగుల సమస్య అధికంగా ఉంటే వేరుశనగ, మిరప, పొగాకు, వంగ పంటలను కొంతకాలం ఆపాలి.
రైతులు పాటించాల్సినవి
భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర, ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వులు, వేరుశనగ వంటి పంటలను వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసే ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి.
ఇలా చేసుకోవచ్చు..
యాసంగిలో వేరుశనగ సాగు చేసిన రైతులు తర్వాత వానాకాలంలో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని లభిస్తుంది. దీంతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును. కంది, శనగ పంటలను వరుసగా వేస్తే కాయతొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. అందుకే ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట వరి వంటి పంటలతో మార్పిడి చేసుకోవాలి. వరితో పంట మార్పిడి చేసుకుంటే వేరుశనగ పంటకు నులిపురుగుల బెడద తగ్గుతుంది. వరుసగా పొద్దుతిరుగుడు పంటను సాగు చేసేవారు కొర్ర, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యాల పంటలను లేదా కంది, శనగ, మినుము వంటి ఆపరాల పంటలను లేదా వేరుశనగతో పంట మార్పిడి చేసుకోవచ్చు. వంగ తోట వేసిన రైతులు క్యాలీఫ్లవర్‌తో పంట మార్పిడి చేసుకుంటే వంగకు ఎండు తెగులు సోకదు. టమాట, ఆవాలు, బంతి ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేస్తే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది.
ధాన్యం పంటలతో..
దోస, కాకర, గుమ్మడి, పొట్ల, బీర, బూడిద గుమ్మడి, దొండ వంటి కూరగాయల పంటలను వరి పైరుతో, ఉల్లి సాగు చేసే రైతులు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఒకసారి పసుపు సాగు చేసిన వారు రెండేళ్ల పాటు భూమిలో పసుపు సాగు చేయకూడదు. ఒకవేళ చేస్తే దిగుబడి తగ్గుతుంది. చీడపీడల బెడద పెరుగుతుంది. వరి, చెరుకు, అరటి, తమలపాకు, కూరగాయల పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. పసుపు తర్వాత వరి, జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. మిరప, వేరుశనగ, క్యాబేజీ పంటలను ఆశించే లద్దె పురుగుల తాకిడి అరికట్టాలంటే జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో మార్పిడి చేయాలి.
ఇలా చేయొద్దు..
పంట మార్పిడికి అనుకూలమైన పంటనే ఎంచుకోవాలి. లేదంటే చీడపీడలు పెరుగుతాయి. బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఈ రెండు పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశిస్తాయి. జొన్న వేసిన పొలాల్లో మిరప వేయకూడదు. పసుపు తర్వాత మిరప, టమాటా, క్యాబేజీ, దోస, గుమ్మడి, సోర, బీర, పత్తి, ఆవాలు, బెండ వేసుకోకూడదు. ఆకుముడత ఆశించే ప్రాంతాల్లో వేరుశనగ, సోయాచిక్కుడు వేయకూడదు.
ఎంపికలో జాగ్రత్తలు
పంట మార్పిడి చేయాలంటే అంతకుముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పంటను ఎంచుకోవాలి. కొన్ని పంటల వేరు వ్యవస్థలు నేల పొరల నుంచి పోషకాలన్నీ ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వులు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్నకు బదులుగా అపరాల పంటలతో పంట మార్పిడి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అపరాల పంటలు కరువు పరిస్థితులను తట్టుకుంటాయి. ఆకుల్ని రాల్చి భూమికి సేంద్రీయ పదార్థాన్ని అందిస్తాయి. అపరాల పంటల మీద ఉండే బుడిపెలు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. సూక్ష్మజీవుల చర్య వల్ల ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. నల్లరేగడి నేలల్లో సోయాచిక్కుడు వేసుకుంటే పంట కోత సమయానికి ఆకులు పూర్తిగా రాలుతాయి. తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రీయ పదార్థం లభిస్తుంది.


