అమ్మమ్మ చెప్పిన నీతి కథ
నాకు మా అమ్మమ్మ చెప్పిన నీతి కథల్లో ఈ తోడేలు, కుక్క కథ బాగా నచ్చింది. ఆ కథను మీతో పంచుకుంటున్నాను.
నార్కట్‌పల్లి : అడవిలో ఉండే తోడేలు దారి తప్పి ఊళ్లోకి వచ్చింది. అది తోవ వెంబడి వెళ్తుండగా ఒక కుక్క దానికి ఎదురొచ్చింది. తోడేలు ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ.. ‘నీ మెడలో ఆ గొలుసు, ఆ బిళ్ల ఏమిటి?’ అని ప్రశ్నించింది. ఓహ్ అదా.. ‘నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకెళ్లి కాల్చివేయకుండా ఉండడానికి ఈ బిళ్లను నా మెడలో కట్టాడు’ అని కుక్క చెప్పింది. ఆశ్చర్యంగా ఉందే అంది తోడేలు. ‘నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే. మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు. రోజూ వేడి నీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి ప్లేటు, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి. అంతేకాదు నిద్రించడానికి మెత్తటి పరుపు కూడా ఉంది’ అని చెప్పింది కుక్క. అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. జాతి వైరం మరచి మేమంతా సరదాగా ఆడుకుంటాం’ అని చెప్పింది. మిత్రమా.. ఈరోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను కూడా మీ ఇంటికి తీసుకెళ్లు అంది తోడేలు. సరేనంటూ కుక్క ఆ తోడేలును తన ఇంటికి తీసుకెళ్లింది. యజమాని చూస్తే కొడతాడని తోడేలును పెరట్లో చెట్టు చాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. కుక్క తనకు చేసే అతిథి మర్యాదలను చూసి సంతోషించాల్సింది పోయి.. ‘నేను అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమా’ అని అసూయ చెందింది తోడేలు. ‘నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు వెళ్లిపో’ అంది తోడేలుతో కుక్క. మిత్రమా నిన్ను వదిలి వెళ్లాలని లేదు ఇంకొక్క రోజు ఉండి వెళ్తాను అంది తోడేలు. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో తోడేలు.. అక్కడ ఉన్న పిల్లులను చంపి తిని ఎముకలు పడేసి వెళ్లిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంతపని చేసిందని అనుకున్నాడు యజమాని. దీంతో ఆ కుక్కను చితకబాది ఇంటి నుంచి తరిమేశాడు.
నీతి : దుర్మార్గులతో స్నేహం చేస్తే చివరికి మనకు ప్రాణాపాయం లేదా పెద్ద నష్టం కలుగుతుంది. అందుకే ఎప్పుడూ మంచివారితోనే స్నేహం చేయాలి.


