భువనగిరిటౌన్ : అధికారుల అలసత్వం వల్ల భువనగిరి పట్టణంలో నిరాశ్రయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిరుపేదల నీడ కోసం నిర్మించిన ఆశ్రమం కేవలం ప్రారంభానికే పరిమితమైంది. నిర్వహణను గాలికొదిలేయడంతో ప్రజాధనం వృథా అవుతోంది. ఉండడానికి చోటు లేక వృద్ధులు, దివ్యాంగులు ఫుట్‌పాత్‌లను ఆశ్రయిస్తున్నారు.
నిర్వహణ లోపం.. నిరాశ్రయులకు శాపం
భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద రహదారి బంగ్లా ఆవరణలో నిరాశ్రయుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వసతి గృహాన్ని నిర్మించింది. అయితే, భవన నిర్మాణం పూర్తయినా నిర్వహణ బాధ్యతలను ఎవరూ పట్టించుకోకపోవడంతో అది భూత్ బంగ్లాను తలపిస్తోంది. తలుపులు బార్లా తెరిచి ఉండడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిరాశ్రయులు లోపలికి వెళ్లేందుకు భయపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ భవనం నేడు నిరుపయోగంగా మారింది.
వినాయక చౌరస్తాలో దయనీయం..
వినాయక చౌరస్తాతోపాటు ఇతర రద్దీ ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లే నిరాశ్రయులకు ఆవాసాలుగా మారాయి. పగలు మండుతున్న ఎండకు ఎండుతూ, రాత్రి వేళల్లో చలికి వణుకుతూ వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వానొస్తే తలదాచుకోవడానికి చెట్ల కిందికో, దుకాణాల అరుగుల మీదకో వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆకలి తీర్చుకోవడానికి ఆధారం లేక, ఉండడానికి నీడ లేక వృద్ధులు, దివ్యాంగులు పడుతున్న కష్టాలను చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు.
ప్రజాధనం వృథా !
లక్షల రూపాయలు ఖర్చు చేసి భవనాలు నిర్మించి, వాటిని వదిలేయడంపై భువనగిరి పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల నిరాశ్రయులకు అందాల్సిన సాయం అందకుండా పోతోంది. ఇకనైనా జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులు స్పందించి హైదరాబాద్ చౌరస్తా వద్ద ఉన్న వసతి గృహాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని, నిరాశ్రయులను అక్కడికి తరలించి వారికి కనీస వసతులు కల్పించాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఫ నిరుపయోగంగా
నిరాశ్రయుల వసతి గృహం
ఫ లక్షల రూపాయలు పోసి కట్టారు..
గాలికి వదిలేశారు
ఫ చౌరస్తాల్లోనే అభాగ్యుల అగచాట్లు
ఫ పట్టించుకోని పాలకులు


