సబర్బన్‌ సాకారమయ్యేనా.. | - | Sakshi
Sakshi News home page

సబర్బన్‌ సాకారమయ్యేనా..

May 11 2026 7:14 AM | Updated on May 11 2026 7:14 AM

డిపో నిర్మాణం వెనక్కి..

భూదాన్‌పోచంపల్లి : చేనేతకు ప్రసిద్ధి చెంది ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు తెచ్చుకున్న భూదాన్‌ పోచంపల్లికి సబర్బన్‌ బస్సు సర్వీస్‌లు నడపాలని చాలాకాలంగా స్థానిక ప్రజలు కోరుతున్నా ఆ కల నెరవేరడం లేదు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న భూదాన్‌ పోచంపల్లి మున్సిపాలిటీగా మారి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్‌కు చేరువలో ఉండడంతో చీరలు కొనుగోలు చేయడానికి నిత్యం ప్రజలు పోచంపల్లికి వచ్చిపోతుంటారు. అంతేకాక పోచంపల్లి ఇక్కత్‌, చేనేత వస్త్ర తయారీ తీరుతెన్నులు, భూదానోద్యమ చరిత్రపై అధ్యయనం చేయడానికి విద్యార్థులతోపాటు దేశ, విదేశాల నుంచి పర్యాటకులువస్తుంటారు. ఇక్కడి గ్రామీణ వాతావరణంతో నిత్యం సినిమా, సీరియల్‌ షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఇలా పోచంపల్లికి ఎన్నో ప్రత్యేకతలు ఉండి పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా సబర్బన్‌ బస్సు సర్వీస్‌లు మాత్రం నడపడం లేదు.

30 కిలోమీటర్లకు సబర్బన్‌ విస్తరణ

హైదరాబాద్‌ చుట్టూ హెచ్‌ఎండీఏ పరిధిలోని మండలాల్లో 30 కిలోమీటర్ల వరకు సబర్బన్‌ పరిధిగా గుర్తించి ఆర్టీసీ అధికారులు సబర్బన్‌ బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి పోచంపల్లి పట్టణానికి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 30 కిలోమీటర్ల దూరం అంటే జలాల్‌పురం గ్రామం వరకు సబర్బన్‌ పరిధిలోకి వస్తుంది. కానీ, ప్రస్తుతం సబర్బన్‌ బస్సులు మండల శివారులోని రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం వరకే వస్తున్నాయి. మరోవైపు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వయా దేశ్‌ముఖి మీదుగా పిలాయిపల్లికి వరకు సబర్బన్‌ బస్సులు నడుస్తున్నాయి. అదేమాదిరిగా మరో 5 కిలోమీటర్ల దూరాన్ని విస్తరిస్తే పర్యాటక కేంద్రమైన భూదాన్‌ పోచంపల్లికి సబర్బన్‌ బస్సులు నడిపించే అవకాశాలు ఉన్నాయి.

రోజుకు 4 వేల మంది ప్రయాణం

హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న పోచంపల్లికి దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తుంటాయి. ప్రతిరోజూ పోచంపల్లి నుంచి సుమారు 4 వేల మందికిపైగా ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులతోపాటు వస్త్ర, పాలు, పండు, పూల వ్యాపారులు, ఉద్యోగులు హైదరాబాద్‌కు వెళ్తుంటారు. ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌ డిపోనకు చెందిన 9 బస్‌ సర్వీసులు రోజుకు 3 నుంచి 4 ట్రిప్పుల చొప్పున వచ్చిపోతున్నాయి.

ఫ పోచంపల్లి సబర్బన్‌ పరిధిలో ఉన్నా నడవని బస్సులు

ఫ 30 నుంచి 35 కిలోమీటర్ల వరకు పరిధిని పెంచి

నడపాలంటున్న గ్రామస్తులు

ఫ రోజూ 4వేల మందికిపైగా రాకపోకలు

హెచ్‌ఎండీఏ పరిధిలోని శివారు మండలాల్లో ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేయాలని గతంలో ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. దీంతో రాజధానికి చేరువలో ఉన్న పోచంపల్లికి కూడా డిపో మంజూరైంది. కానీ, మెయిన్‌ రోడ్డుకు సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం లభించక డిపో వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పోచంపల్లి పట్టణం వరకు సబర్బన్‌ బస్సులు నడిపితే రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement