సూర్యాపేటటౌన్ : గంజాయి సేవించడంతోపాటు సరఫరా చేసే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 6న సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ బాలునాయక్ తన సిబ్బందితో సూర్యాపేట–దోసపహాడ్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై అనుమానాస్పదంగా వెళ్తుండగా పట్టుకుని విచా రించారు. సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంకు చెందిన దేశగాని గణేశ్ అలియాస్ తీట శివ, పెన్‌పహాడ్ మండలం చీదేళ్ల గ్రామానికి చెందిన పశుల రాంచరణ్, పెన్‌పహాడ్ మండలంలోని మోర్సకుంట తండాకు చెందిన పోతరాజు బన్నిలుగా గుర్తించారు. వారి వద్ద ఉన్న సంచిలో కిలో గంజాయి లభ్యమైంది. ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరుకు వెళ్లి అక్కడ గంజాయిని కిలో రూ.2000 చొప్పున కొనుగోలు చేసిన కొంత అమ్మి, కొంత తాగాలని నిర్ణయించుకున్నారు. వాటిని 10 గ్రాముల ప్యాకెట్‌లుగా చేసి ఒక ప్యాకెట్‌కు రూ.1000 చొప్పున అమ్మాలనుకున్నారు. పల్సర్ బైక్‌పై సూర్యాపేట బస్టాండ్, చుట్టుపక్కల అమ్మేందుకు వెళ్లగా ఎవరూ కొనలేదు. దీంతో తిరిగి కుసుమవారిగూడెం వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద కిలో 160 గ్రాముల గంజాయి, ఒక బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.


